Skip to main content

Trees: అడవుల్లో అంతర్గత నెట్‌వర్క్‌.. చెట్లు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయా?

చెట్ల మధ్య ప్రత్యేకమైన సమాచార వ్యవస్థ ఏమైనా ఉంటుందా? దాని సాయంతో సమాచారంతో పాటు అవసర సమయాల్లో శక్తిని కూడా అంతర్గతంగా అవి పరస్పరం ఇచ్చిపుచ్చుకోగలవా? ఇలా జరుగుతుందనే నమ్మకాలు చాలా నాగరికతల్లో కనిపించేవే. వీటిలో నిజానిజాలపై ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. ఇది మరీ సత్యదూరమేమీ కాదని తాజా అధ్యయనం ఒకటి చెబుతుండటం ఆసక్తికరం..
Trees Talk

అడవులు. అంతుచిక్కని విశేషాలకు నిలయాలు. వాటికి సంబంధించి మనుషుల్లోనూ ఎన్నో నమ్మకాలు ఏర్పడుతూ వచ్చాయి. ఇందుకు చరిత్ర పొడవునా ఎన్నో తార్కాణాలు. అలాంటి నమ్మకాల్లో ఒకటి, అడవుల్లో చెట్ల మధ్య మనకు తెలియని అంతర్గత నెట్‌వర్క్‌ ఒకటి అల్లుకుని ఉంటుందన్నది. చెట్లు తమకు అందుబాటులో ఉన్న వనరులను తమ నుంచి పుట్టుకొచ్చిన మొక్కలకు పంచుతాయని కూడా చెబుతుంటారు.
అవసర సమయాల్లో వాటికి అండగా నిలిచి కాపాడుకుంటాయన్నది కూడా ఒక భావన. భూమి లోపల ఉండే పలు రకాల ఫంగస్‌లను చెట్లు యానకంగా, మాధ్యమంగా చేసుకుంటాయని కొందరు సైంటిస్టుల సూత్రీకరణ. వాటి సాయంతో అడవుల్లో చెట్ల మధ్య ఎన్నో రకాల నెట్‌వర్క్‌లు విస్తరించి ఉన్నట్టు భావిస్తున్నారు. దీన్ని ‘వుడ్‌–వైడ్‌–వెబ్‌’గా వారు అభివర్ణిస్తుంటారు. వీటికి సంబంధించి ఇప్పటిదాకానైతే కచ్చితమైన రుజువులేమీ దొరకలేదు. వీటిలోని నిజానిజాలను నిర్ధారించేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ అల్బెర్టాకు చెందిన అధ్యయన బృందం ప్రొఫెసర్‌ జస్టిన్‌ కర్‌స్ట్‌ సారథ్యంలో చాలాకాలం పాటు పరిశోధనలు జరిపింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)

మాధ్యమంగా సీఎంఎన్‌ 
పుట్టగొడుగులు తదితర ఫంగస్‌ల్లో సాధారణ అనుసంధాన వ్యవస్థ ఒకటి భూ ఉపరితలం లోపల ఉంటుందని చెబుతుంటారు. దీన్ని సైంటిస్టులు కామన్‌ మైకోరిజల్‌ నెట్‌వర్క్స్‌ (సీఎంఎన్‌)గా పిలుస్తుంటారు. కర్‌స్ట్‌ బృందం ప్రధానంగా దీనిపైనే దృష్టి సారించింది. ఈ నెట్‌వర్క్‌ల ఉనికి నిజమేనని తమ పరిశోధనలో తేలినట్టు చెబుతోంది. అయితే ఈ నెట్‌వర్కులు చెట్లు, మొక్కలకు కూడా యానకంగా పని చేసి వాటి మధ్య భూగర్భ నెట్‌వర్క్‌కు వీలు కల్పిస్తున్నాయన్న దాన్ని రుజువు చేసేందుకు మాత్రం గట్టి సాక్ష్యాలు లభించాల్సి ఉందంటున్నారు. అయితే సీఎంఎన్‌ నెట్‌వర్క్‌ల ఉనికి వాస్తవమేనని తేలడం వరకూ ఈ విషయంలో ఒక పెద్ద ముందడుగేనని కర్‌స్ట్‌ చెబుతున్నారు.

Forest


వెలుగులోకి ఆసక్తికర అంశాలు 
కర్‌స్ట్‌ బృందం అధ్యయన ఫలితాలు నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్‌ జర్నల్లో పబ్లిషయ్యాయి. ఈ విషయమై ఇప్పటికే జరిగిన ఇతర అధ్యయనాల ఫలితాలతో వాటిని పోల్చి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను నిగ్గుదేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాకు చెందిన మెలనీ జోన్స్, యూనివర్సిటీ ఆఫ్‌ మిసిసిపీకి చెందిన జేసన్‌ హోక్సెమా చేతులు కలిపారు. సీఎంఎన్‌ల మాదిరిగా చెట్ల మధ్య అంతర్గత నెట్‌వర్క్‌ల ఉనికి నిజమో కాదో నిర్ధారించేందుకు ఏకంగా 1,600కు పైగా పరిశోధన పత్రాలను వారు లోతుగా విశ్లేషించారు. వారు తేల్చిందేమిటంటే..  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (15-21 జనవరి 2023)

• చెట్ల మధ్య అంతర్గతంగా నెట్‌వర్కులున్నాయనేందుకు ఇప్పటిదాకా సాక్ష్యాల్లేవు.
• అయితే అందుకు ప్రధాన కారణం సీఎంఎన్‌ నిర్మాణం, పనితీరుపై సమాచార లేమే! 
• ఫంగస్‌ల తాలూకు సీఎంఎన్‌ల ద్వారా భూగర్భంలో చెట్ల మధ్య వనరుల బదిలీ జరుగుతుందని 26 అధ్యయనాలపై జరిపిన విశ్లేషణలో తేలింది. అదెలాగన్నది కనిపెట్టడం మాత్రం సాధ్యపడలేదు. 
• మరో రెండు అధ్యయనాల్లో చెట్ల మధ్య ఉమ్మడి ఫంగస్‌ లింకులున్నట్టు కూడా తేలింది. 
• పూర్తిగా ఎదిగిన చెట్లు సీఎంఎన్‌లను మాధ్యమంగా చేసుకుని అందుబాటులో ఉన్న వనరులను తమనుంచి పుట్టుకొచ్చిన మొక్కలకు అందజేస్తాయని, ఆపద సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సంకేతాలు కూడా పుంపుతాయన్న భావనలో పెద్దగా అసంబద్ధత కూడా కనిపించదు. బహుశా అలా జరుగుతూ ఉండొచ్చు. 
• కీటకాల దాడి గురించి మొక్కలకు సీఎంఎన్‌ మాధ్యమం ద్వారా చెట్లు హెచ్చరించడం ఒక అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. 
• మరిన్ని సాక్ష్యాలు లభించనిదే చెట్ల అంతర్గత నెట్‌వర్క్‌పై పక్కాగా ఏమీ చెప్పలేం.

Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు!

Published date : 16 Feb 2023 01:16PM

Photo Stories