Skip to main content

Chandrayaan-3 Updates: చివ‌రి ఏడు రోజులే కీలకమంటున్న ఇస్రో

భారత్‌ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది. ల్యాండర్‌ దిగిన మరికొన్ని గంటలకే దాని నుంచి రోవర్‌ కూడా బయటకొచ్చి తన పనిని మొదలుపెట్టేసింది.
Chandrayaan-3 lander Rover
Chandrayaan-3 lander Rover

మొత్తం 14 రోజులపాటు రోవర్‌ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఏడు రోజులు పూర్తయ్యాయి. మరో ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తరువాత చంద్రుడిపై 14 రోజులపాటు చిమ్మ చీకట్లు ఆవరించడంతో పాటు భారీగా మంచు కురుస్తుందని పేర్కొంటున్నారు. దీంతో ల్యాండర్, రోవర్‌లు పనిచేస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి 14 రోజులు తర్వాత ల్యాండర్, రోవర్లు ఉన్న చోట మళ్లీ సూర్యకిరణాలు పడతాయి. వీటికి సోలార్‌ ప్యానెల్స్‌ రీస్టార్ట్‌ అయితే ల్యాండర్, రోవర్లు తిరిగి పనిచేస్తాయి. లేదంటే వాటి కాలపరిమితి తీరిపోయినట్టేనని చెబుతున్నారు. కాగా ఇప్ప‌టి వరకు తన ఏడు రోజుల ప్రయాణంలో రోవర్‌ సుమారు 250 మీటర్ల దూరం ప్రయాణం చేసినట్టు ఇస్రో వెల్లడించింది.

Pragnyan Rover Finds Sulphur on Moon: చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన ప్రగ్యాన్‌ రోవర్‌

విజయవంతంగా లిబ్స్‌..

కాగా రోవర్‌లో అమర్చిన లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌) అనే పేలోడ్‌ విజయవంతంగా పనిచేయడం వల్ల చంద్రుడిలో దాగిన రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్‌ ఉనికిని తొలిసారి కనుగొన్నారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్,క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్‌తో పాటు ఆక్సిజన్‌ కూడా ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం హైడ్రోజన్‌ కోసం మరింతగా రోవర్‌ పరిశోధనలు చేస్తోంది. అయితే లిబ్స్‌ అనే పేలోడ్‌ చంద్రుడి ఉపరితలంపై శక్తివంతమైన లేజర్‌ను షూట్‌ చేసినప్పుడు.. అందులో నుంచి వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి ఆ డేటాను ఇస్రో భూ నియంత్రిత కేంద్రానికి పంపుతోంది. ఈ సైంటిఫిక్‌ పేలోడ్‌ను బెంగళూరులోని లేబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టం (లియోస్‌) అభివృద్ధి చేసింది. 

Vikram Lander Image : విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రగ్యాన్‌ రోవర్‌

భారత్, చైనాకు చెందిన రెండు రోవర్లు 

మరోవైపు 2019 జనవరి 3న చంద్రుడి దక్షిణ ధృవం ప్రాంతంలో ఐట్కిన్‌ బేసిన్‌లో చైనాకు చెందిన వాంగ్‌–4 మిషన్‌ యూటూ 2 రోవర్‌ సైతం పరిశోధనలు చేస్తోంది. భారత్, చైనా రోవర్ల మధ్య దూరం 1,948 కిలోమీటర్లు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒకేసారి రెండు రోవర్లు పనిచేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు.

High temperature on Moon: చంద్రుడిపై అధిక‌ ఉష్ణోగ్రతలు

Published date : 31 Aug 2023 01:24PM

Photo Stories