Skip to main content

NASA: ఆస్టరాయిడ్‌పై దాడికి రెడీ..!

అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. వాటిలో కొన్ని భూమికి చాలా దగ్గరగా దూసుకెళ్తున్నాయి. అందులో ఏదైనా భూమిని ఢీకొంటే.. జరిగేది వినాశనమే.
NASA
NASA

అలాంటి ఆస్టరాయిడ్లను మధ్యలోనే దారి మళ్లించడంపై నాసా శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా అంతరిక్షంలో ఒక ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టి దాని కక్ష్యను మార్చేందుకు ఒక ఉపగ్రహాన్ని పంపుతున్నారు. మానవ చరిత్రలోనే తొలి ప్లానెటరీ డిఫెన్స్‌ (భూమిని కాపాడుకునే) ప్రయోగం ఇదే. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా..? 
 

వాటితో ప్రమాదమే.. 
ఆస్టరాయిడ్లతో భూమ్మీద జీవానికి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పటివరకు చాలాసార్లు ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టాయి. దానివల్లే డైనోసార్లు సహా చాలా రకాల జీవులు అంతరించిపోయాయి. మరి అలా భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే ప్రమాదమున్న ఆస్టరాయిడ్లను పేల్చేయడమో, దారి మళ్లించడమో చేస్తేనే మానవ మనుగడ ఉంటుందన్నది స్పష్టమే. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాసా ‘డార్ట్‌ (డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌)’ప్రయోగాన్ని చేపట్టింది. నేడు (బుధవారం) ఉపగ్రçహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.  
 

జంట ఆస్టరాయిడ్లపైకి..:
సౌర వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అదే క్రమంలో భూమి కక్ష్యకు కాస్త పక్కన ‘డిడిమోస్‌– డిడిమూన్‌’గా పిలిచే రెండు జంట ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయి. ఏటా రెండు సార్లు ఇవి భూమికి కాస్త సమీపంగా వస్తుంటాయి. అలా 2003లో భూమికి 37 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాసా తమ ప్రయోగం కోసం ఈ జంట ఆస్టరాయిడ్లను ఎంపిక చేసింది. 
➤ ఈ జంట ఆస్టరాయిడ్లలో ప్రధానమైనది డిడిమోస్‌. 780 మీటర్ల పరిమాణంలోని భారీ గ్రహశకలం అది. రెండోది డిడిమూన్‌. దీని పరిమాణం 160 మీటర్లు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టుగా.. డిడిమోస్‌ చుట్టూ డిడిమూన్‌ తిరుగుతూ ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్లు సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 450 కోట్ల సంవత్సరాల కిందటివని అంచనా. 
➤ సుదీర్ఘకాలంలో అంటే కొన్ని వేలు/లక్షల ఏళ్ల సమయంలో ఎప్పుడైనా డిడిమూన్‌ భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వ్యోమనౌక, ఉపగ్రహం జంటగా.. 
➤ నవంబర్‌ 24న స్పేఎస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా డార్ట్‌ మిషన్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో నాసాతోపాటు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) కూడా పాలుపంచుకుంటోంది. 
➤ డార్ట్‌ మిషన్‌లో ప్రధానమైన వ్యోమనౌక (బరువు 650 కిలోలు), లిసియా క్యూబ్‌గా పిలిచే చిన్న ఉపగ్రహం.. కొద్దినెలలు  ప్రయాణించి వచ్చే ఏడాది సెపె్టంబర్‌ చివరిలో ‘డిడిమోస్‌–డిడిమూన్‌’జంట ఆస్టరాయిడ్ల దగ్గరికి చేరుకుంటాయి. 

➤డిడిమూన్‌ను ఢీకొట్టడానికి పదిరోజుల ముందు డార్ట్‌ వ్యోమనౌక నుంచి లిసియా క్యూబ్‌ విడిపడి.. కాస్త వెనకగా ప్రయాణిస్తుంది. 
➤ వచ్చే ఏడాది అక్టోబర్‌ రెండో తేదీన డార్ట్‌ వ్యోమనౌక గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో డిడిమూన్‌ను ఢీకొడుతుంది. 
➤ వెనుకగా వస్తున్న లిసియా క్యూబ్‌ ఈ ఘటనను, తర్వాతి పరిస్థితులను
చిత్రీకరించి భూమికి పంపుతుంది. 

➤ ఈ ఘటన సమయంలో ఆస్టరాయిడ్లు భూమికి సుమారు కోటీ 10 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండనున్నాయి. 
➤ మొత్తం ప్రయోగాన్ని భూమిపై ఉన్న భారీ, అత్యాధునిక టెలిస్కోప్‌లతోనూ క్షుణ్నంగా పరిశీలించనున్నారు.

తెలుసుకునేది ఏమిటి? 
నాసా పంపిన ఉపగ్రహం డిడిమూన్‌ను ఢీకొట్టినప్పుడు.. దాని కక్ష్య అత్యంత స్వల్పస్థాయి మారే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఎంత బరువుతో, ఎంత వేగంతో, ఏ కోణంలో ఢీకొడితే.. కక్ష్యలో ఎంత మార్పు వచ్చిందనేది గుర్తించనున్నారు. ఈ వివరాల ఆధారంగా తర్వాతి ప్రయోగాలను కొనసాగించనున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఆస్టరాయిడ్‌ భూమివైపు దూసుకొస్తుంటే.. దాని దిశను మార్చడానికి ఏ మేర వనరులు అవసరం అవుతాయన్నది అంచనా వేయనున్నారు. 
➤ ప్రస్తుతం డార్ట్‌ ఉపగ్రహం డిడిమూన్‌ కక్ష్యను అతిస్వల్పంగానే మార్చినా.. అది దీర్ఘకాలంలో ఎక్కువ ప్రభావమే చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  

భూమికి దగ్గరగా 25 వేల ఆస్టరాయిడ్లు..
అంతరిక్షంలో భూమికి సమీపంగా వచ్చే ఆస్టరాయిడ్లు 25 వేలకుపైనే ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. వాటిని ‘ఎన్‌ఈఓ (నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌)’గా పిలుస్తారు. 
➤ భూమికి 46 లక్షల కిలోమీటర్ల దగ్గరిదాకా వచ్చే ఆస్టరాయిడ్లలో.. సుమారు 150 మీటర్లకన్నా పెద్దగా ఉండేవాటిని ప్రమాదకరమైనవి (పొటెన్షియల్లీ హజార్డస్‌)గా పరిగణిస్తారు. ఇలాంటివి 100కుపైగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. Ü ఇటీవలే భూమికి సమీపంగా దూసుకెళ్లిన ‘బెన్ను’అనే ఆస్టరాయిడ్‌ నుంచి ప్రమాదం పొంచిఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రకటించారు. వచ్చే మూడు వందల ఏళ్లలో అది భూమిని ఢీకొట్టేందుకు 1/1,750 (1,750 ఇంట ఒక శాతం) అవకాశం ఉన్నట్టు తెలిపారు. 

ఇంకా చాలా చేయాలి..
భూమిని ఆస్టరాయిడ్ల నుంచి రక్షించుకునేదిశగా ‘డార్ట్‌’ప్రయోగం అతిచిన్నదని నాసా శాస్త్రవేత్త నాన్సీ చాబోట్‌ తెలిపారు. ‘‘భూమికి ప్రమాదం కలిగించగల ఆస్టరాయిడ్లను గుర్తించడం. ట్రాక్‌ చేయడం చాలా ముఖ్యం. అందులో కచ్చితంగా ప్రమాదం కలిగించగల వాటిని ఎలా అడ్డుకోవాలన్నది తేల్చాలి. అందుకు అవసరమైన సమాచారాన్ని డార్ట్‌ ప్రయోగం అందించనుంది. ఈ దిశగా ఇంకా చాలా చేయాల్సి ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు. 

Published date : 25 Nov 2021 03:30PM

Photo Stories