Skip to main content

Artemis-1 Mission : ఆర్టెమిస్‌ 1 నిలిపివేసిన నాసా.. కార‌ణం ఇదే..

నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌ 1 ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌లో RS-25 ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల తొలుత కౌంట్‌డౌన్ గడియారం నిలిపివేసింది నాసా.
artemis-1 mission

అనంతరం సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఆగ‌స్టు 29వ తేదీన‌ (సోమవారం) ప్రయోగం ఉండదని.. తిరిగి ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించింది.

ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్, ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంది. అయితే టీమ్ ఇంజనీర్‌లు ఇంజిన్‌లలో ఒకదానిలో ఆశించిన విధంగా కాలేదని గమనించారు. ఇంజిన్ నంబర్ 3కి సంబంధించిన సమస్యపై బృందం పని చేస్తున్నందున లాంచ్ ప్రస్తుతం ప్రణాళిక లేకుండా నిలిపివేయబడిందని నాసా ప్రకటించుకుంది.

అంతకు ముందు కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి.. లాంఛ్‌ డైరెక్టర్‌తో చర్చించినట్లు తెలిపింది. ప్రయోగం ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే సస్పెన్స్‌ కొనసాగగా.. చివరికి వాయిదా వైపే మొగ్గు చూపింది నాసా.

ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా ఆగ‌స్టు 29వ తేదీన అమెరికా స్పేస్ సెంట‌ర్ నాసా స్పేస్ లాంచ్ సిస్ట‌మ్‌(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. దీనితో పాటు ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపాల్సి ఉంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంట‌ర్ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది.

శాశ్వత ఆవాసాల కోసమే.. 

Nasa

దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్‌ మిషన్‌లో భాగంగా..  ఆర్టెమిస్‌-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.

ఆర్టెమిస్‌-1 త‌ర్వాత జ‌రిగే ప్ర‌యోగాలు ఇలా..

artemis mission


2024లో ఆర్టెమిస్‌-2 యాత్రను నిర్వహిస్తుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది. 

జాబిలి ఉపరితలానికి చేరుకోవడానికి ముందు..
2025లో ఆర్టెమిస్‌-3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనుంది. ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని డిపో నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది. తర్వాతి దశలో గేట్‌వే పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది. జాబిలి ఉపరితలానికి చేరుకోవడానికి ముందు వ్యోమగాములు ఇందులో బస చేస్తారు. సుదూర అంతరిక్ష యాత్రలకూ దీన్ని విడిది కేంద్రంగా ఉపయోగించుకుంటారు.

Published date : 29 Aug 2022 07:03PM

Photo Stories