Skip to main content

5G Services: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. దీనివల్ల..

అమెరికాలో జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి ప్రారంభమైన 5జీ సేవలతో విమానాలకు పెనుముప్పు ఏర్పడుతుందన్న భయాలు యూఎస్‌ వైమానిక రంగంపై పెనుప్రభావం చూపుతున్నాయి.
5G Services
5G Services

దేశమంతటా పలుచోట్ల విమానాలను రద్దు చేయడం లేదా దారి మరలించడం జరుగుతోంది. దీంతో ప్రవాస భారతీయులు సహా వేలాదిమంది ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పలు ఇతర దేశాలు అమెరికాకు నడిపే విమానాలను రద్దు చేసుకున్నాయి. విమానాల నావిగేషన్‌ వ్యవస్థను కొత్తగా ఆరంభించే 5జీ వ్యవస్థ దెబ్బతీయవచ్చన్న అనుమానాలున్నాయి. 

దీనివల్ల..
5జీ తరంగాలు(సీ బ్యాండ్‌ తరంగాలు) విమానాల రేడియో ఆల్టిమీటర్‌ (భూమి మీద నుంచి విమానం ఎంత ఎత్తులో ఉందో కొలిచేందుకు ఉపయోగపడే సాధనం)పై ప్రభావం చూపుతాయని, దీనివల్ల ఇంజిన్, బ్రేకింగ్‌ సిస్టమ్‌ ల్యాండింగ్‌ మోడ్‌లోకి వెళ్లకుండా నిరోధం ఎదురయ్యే ప్రమాదం ఉందని, దీంతో విమానం రన్‌వేపై ఆగకపోవచ్చని జ‌న‌వ‌రి 14న అమెరికా వైమానిక నియంత్రణా సంస్థ(యూఎస్‌ఎఫ్‌ఏఏ) హెచ్చరించింది. ఆల్టిమీటర్‌ వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే, 5జీ సేవల స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ(3.7-3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ) ఉంది. అందువల్ల విమానాలకు ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. 

దీంతో పలు ఎయిర్‌ఇండియా, ఎమిరేట్స్‌ తదితర అంతర్జాతీయ విమానయాన సంస్థలు యూఎస్‌కు విమానాలను రీషెడ్యూల్‌ చేశాయి. మరోవైపు జ‌న‌వ‌రి 19వ తేదీన ప్రారంభించిన 5జీ సేవల పరిధిని నియంత్రిస్తామని, యూఎస్‌లో విమానాశ్రయాల వద్ద 5జీ సేవలను జాప్యం చేస్తామని టెలికం కంపెనీలు హామీ ఇచ్చినట్లు డెల్టా ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. మరిన్ని రక్షణాత్మక చర్యలు చేపట్టేవరకు 5జీ సేవల ఆరంభాన్ని నిలిపివేయాలని ఇతర ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో కలిసి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపింది. 

40 దేశాల్లో 5జీ సేవలు సురక్షితంగా..
విమానాల రక్షణకు అల్టిమేటర్ల సేవలు చాలా కీలకమని వివరించింది. విమానాల నిలిపివేత ప్రభావం ప్రయాణికులతో పాటు సరుకు రవాణాపై కూడా పడుతోందని తెలిపింది. కొన్ని విమానాశ్రయాల వద్ద 5జీ సేవలను మరికొన్నాళ్లు నిలిపివేస్తామని ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ (టెలికం కంపెనీలు) మంగళవారం ప్రకటించాయి. ఇదంతా ఎఫ్‌ఏఏ వైఫల్యమని, 40 దేశాల్లో 5జీ సేవలు సురక్షితంగా ఆరంభమయ్యాయని, కానీ అమెరికాలో మాత్రం కుదరడం లేదని కంపెనీలు విమర్శించాయి.  

అమెరికా-భారత్‌ మధ్య..
బుధవారం అమెరికాకు వెళ్లే 8 విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. అమెరికా, భారత్‌ మధ్య ఎయిర్‌ఇండియా, డెల్టా ఎయిర్‌లైన్స్, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు మాత్రమే నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఎయిర్‌ ఇండియా విమానాలు నిలిపివేయగా, మిగిలిన రెండు కంపెనీలు తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎయిర్‌ ఇండియా రద్దు చేసిన విమానాల్లో ఢిల్లీ-న్యూయార్క్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-నెవార్క్‌ తదితర రూట్ల విమానాలున్నాయి. 

ఇప్పటికే 5జీ సేవలు ఆరంభించిన ఇతర దేశాల్లో..
యూఎస్‌లో పరిస్థితిపై సమీక్షిస్తున్నామని, విమాన ప్రయాణాలు పునఃప్రారంభంపై ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. వైమానిక సంస్థల హఠాత్‌నిర్ణయంపై  ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమాన తయారీ సంస్థలు, విమానయాన సంస్థల ఆందోళనతో 5జీ సేవల ప్రారంభాన్ని అమెరికాలో ఇప్పటికే రెండుసార్లు టెలికం సంస్థలు వాయిదా వేశాయి. ఇప్పటికే 5జీ సేవలు ఆరంభించిన ఇతర దేశాల్లో ఈ సమస్య తలెత్తలేదు.

అమెరికాలో 5జీ సేవలు..
అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అమెరినా నుంచి వెళ్లే లేదా అమెరినా రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాడు కేవలం 215 విమానాల మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి.

Published date : 20 Jan 2022 01:26PM

Photo Stories