YSR free crop insurance is ideal for the country : వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్థికంగా ఎంతో రక్షణ కల్పిస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత పంటల బీమాను అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తూ 26 రకాల పంటలకు బీమా వర్తిస్తోందన్నారు.
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోగా పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ), సీజన్ మారేలోగా పంటల బీమా పరిహారం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 2016 ఖరీఫ్‌లో 16.36 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 30.6 లక్షలకు పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన 15.60 లక్షల మంది రైతులకు 2022 ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్లు పరిహారం జమ చేశామన్నారు. ఉల్లి, టమాట, దానిమ్మతోపాటు చిరుధాన్యాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు.
ఇంకా అర్హులుంటే ఆర్బీకేలను సంప్రదించాలి..
పంటలు నష్టపోయిన అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకంగా రూపొందించినట్టు వివరించారు. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లోగా ఆర్బీకేల్లో గానీ గ్రామ సచివాలయాల్లో సంప్రదిస్తే విచారించి పంట నష్ట పరిహారాన్ని అందిస్తామన్నారు. రెండు రకాలుగా నోటిఫైడ్ పంటలకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇందులో దిగుబడి ఆధారిత పంటలు నష్టపోయిన 8,47,759 మంది రైతులకు రూ.2,143.85 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన 7,12,944 మంది రైతులకు రూ.833.97 కోట్లు జమ చేశామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థల వల్ల రైతులకు సరైన పరిహారం దక్కేది కాదని, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పంటల బీమా ప్రీమియానికి దూరంగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు సమయంలోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
తగ్గిన రుణ ఎగవేతలు..
రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున అందుతున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు బాగా తగ్గినట్టు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు కితాబు ఇచ్చారన్నారు. పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైందన్నారు.
క్రాప్ హాలిడే కాదు.. మూడు పంటల ముందస్తు జోరు..
రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ముందస్తుగా నీటిని విడుదల చేసి మూడు పంటలు సాగయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. క్రాప్ హాలిడేకు అవకాశం లేదన్నారు. మూడు పంటలు వస్తే రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా నేల సారవంతం అవుతుందన్నారు. గత నాలుగేళ్లలో రైతుల మరణాలు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. కోనసీమ డెల్టా చివరి ప్రాంతాలకూ నీరందేలా జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుని కాలువల మరమ్మతులు, పూడికతీతపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గతంలో ఆలస్యంగా పంటలు వేయడంతో తుపాన్లతో పంట నష్టపోవడమేగాక మూడో పంటకు అవకాశం ఉండేది కాదన్నారు.
- యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్