waterways on rivers for transportation: కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా
ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది.ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 4,543 కి.మీ మేర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్‌వేస్ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది.
తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్:
ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది.ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్ పవర్ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు.
పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి.
☛☛ YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం