Telangana Industries Department Annual Report Revealed: తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక వెల్లడి
Sakshi Education
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.17,867 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు సాధించింది. సుమారు 4 వేల పరిశ్రమలు రాగా, 96 వేలకు పైగా ఉద్యోగాలు లభించినట్లు పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక (2021–22) పేర్కొంది. టీఎస్‌ఐఐసీ 810 ఎకరాల్లో 13 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి 526 పరిశ్రమలకు కేటాయించింది. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. తెలంగాణ ఏర్పడింది మొదలుకుని ఇప్పటి వరకు 19,961 ఎకరాల్లో 56 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
వాణిజ్య వాతావరణంలో నం.1
- నీతి ఆయోగ్ ‘ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ 2021’ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానం.
- నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం విదేశాలకు ఎగుమతుల్లో 75% వాటా మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణదే.
- దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణది ప్రథమ స్థానం.
- దేశంలోనే తొలి ఐపీ మస్కట్ బడ్డీ ‘రచిత్’ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రం తెలంగాణ.
జీఎస్‌డీపీలో 19.1% వృద్ధి
- ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2021–22లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.11.54 లక్షల కోట్లు. జీఎస్‌డీపీలో రాష్ట్రం 19.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
- 2017–18 నుంచి 2021–22 మధ్యకాలంలో జీఎస్‌డీపీలో తెలంగాణ ఐదేళ్లలో 11.4 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించింది. ఇదే సమయంలో భారత్ 8.5 శాతం సీఏజీఆర్‌ను మాత్రమే సాధించింది.
- ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2014–15 నుం చి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్‌డీపీ 128.3% వృద్ధి చెందగా, ఇదే కాలంలో భారత్ 89.6% మాత్రమే వృద్ధి సాధించింది.
తలసరి ఆదాయం రూ.2,78,833
- 2021–22లో రాష్ట్ర జీఎస్‌వీఏ (గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.3 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం, సేవా రంగం వాటా 18.3 శాతంగా నమోదైంది. జీఎస్‌వీఏకి గత ఏడాది ప్రాథమిక రంగం 18.3 శాతం, ద్వితీయరంగం 20.4 శాతం, తృతీయ రంగం 61.3 శాతాన్ని సమకూర్చాయి.
- 2021–22లో జాతీయ జీడీపీ లో తెలంగాణ వాటా 5 శాతం కాగా, రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఒక శాతం పెరిగింది.
- తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా జాతీయ స్థాయిలో రూ.1,49,848 మాత్రమే. 2014–15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే కావడం గమనార్హం. 2014–15 నుంచి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 124.7 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 72.9 శాతం మాత్రమే.
Published date : 07 Jun 2022 06:46PM