Skip to main content

Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గేయం.. 13.30 నిమిషాలు.. 12 చరణాలు

‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా.. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందించగా, మొత్తం 12 చరణాలతో 13.30 నిమిషాల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేశారు.
Telangana Anthem Performance  Telangana Govt Approves State Anthem   Jaya Jayahe Telangana Song Performance

రచయిత అందెశ్రీ రాసిన గేయాన్ని యథాతథంగా ఆమోదించారు. 

రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిన నేపథ్యంలో తొలి చరణంలోని ‘పది జిల్లాల’.. అనే పదాన్ని తొలగించి ‘పదపదాన’ అనే కొత్త పదాన్ని చేర్చారు. ‘ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి’.. అనే పంక్తితో పాత గేయంలోని చివరి చరణం ముగుస్తుండగా, దాని స్థానంలో ‘ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి’ అనే పంక్తిని కొత్తగా చేర్చారు. 

మూడు చరణాలకు కుదించిన షార్ట్‌ వెర్షన్‌లో ఇవి మినహా ఇతర మార్పులు పెద్దగా లేవు. కానీ 12 చరణాల గేయంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ‘గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు’ అనే పంక్తిలో  ‘నవాబుల’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘భాగ్యనగరి’ అనే కొత్త పదాన్ని చేర్చారు. 

తెలంగాణ ప్రాంత ప్రాచీన పద్య సాహిత్యంతో పాటు పంపన, బద్దెన, భీమకవి, హాలుడు, పాల్కురికి సోమనాథుడు, కాళిదాసు, మల్లినాథసూరి వంటి ఆది కవుల ప్రాశస్త్యాన్ని కొత్త తరాలకు తెలియజేసేలా వారిని కీర్తిస్తూ అందెశ్రీ నాలుగు కొత్త చరణాలను రాశారు. 

బౌద్ధ తార్కికత సంప్రదాయానికి పునాదులు వేసిన దిజ్ఞాగుడు, 600 ఏళ్ల కింద రాచకొండను ఏలిన సింగ భూపాలుడు, సాహస గాథల సమ్మక్క, సారక్కలు, సర్వాయి పాపన్నలు, మీరసాబు, పండు గొల్ల సాయన్నల వీరగాథలను గుర్తు చేసేలా కొత్త చరణాలు సాగుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి మే 30వ తేదీ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మిత్రపక్ష పార్టీల నేతలకు అందించిన రాష్ట్ర గేయం వెర్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

Telangana Geetham: తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ.. దీని విడుద‌ల ఎప్పుడంటే..?
 
2.30 నిమిషాల నిడివి గేయం 
1) జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

2) జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

3) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ 
జై తెలంగాణ జైజై తెలంగాణ

Gold Medal: బంగారు పతకం సాధించిన‌ కరీంనగర్ జిల్లా వాసి..

13.30 నిమిషాల పూర్తి స్థాయి గేయం
1) జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం 
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం 
జై తెలంగాణ జైజై తెలంగాణ 
జై తెలంగాణ  జైజై తెలంగాణ

2) పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల 
బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ    

3) ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన 
తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కీ’ సోమన్న
రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ    

4) కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని గన్న నేల ధిక్కారమే జన్మహక్కు
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ    

5) ‘పోతన’దీ పురిటిగడ్డ.. ‘రుద్రమ’దీ వీరగడ్డ
గండరగండడు ‘కొమురం భీముడే’ నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ 

6) రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
‘సర్వజ్ఞ సింగ భూపాలుని’ బంగరుభూమి
వాణీ నా రాణి అంటూ నినదించిన కవి కులరవి
‘పిల్లలమర్రి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు
జై తెలంగాణ జైజై తెలంగాణ 
జై తెలంగాణ జైజై తెలంగాణ    

7) ‘సమ్మక్క’లు ‘సారక్క’లు సర్వాయి పాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ
దండు నిడిపే పాలమూరు ‘పండు గొల్ల సాయన్న’
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ    

8) కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
డప్పు, ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ    

9) జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర 
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతెనేమి 
తరుగనిదీ నీ త్యాగం మరువనదీ శ్రమ యాగం 
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

10) బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మ వెలగాలి
జై తెలంగాణ  జైజై తెలంగాణ 
జై తెలంగాణ  జైజై తెలంగాణ    

Telangana is now TG not TS: ఇక నుంచి టీఎస్‌ కాదు టీజీ.. ఇకపై అన్ని ఇలా..

11) సిరివెలుగులు జిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద 
సిరులు పండె సారమున్న మాగాణమె కదా నీ యెద 
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ  జైజై తెలంగాణ

12) గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి 
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ 
జై తెలంగాణ జైజై తెలంగాణ

Published date : 31 May 2024 03:26PM

Photo Stories