Skip to main content

Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

తెలంగాణ రాష్ట్ర అప్పులు నికరంగా రూ.2,83,452 కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Telangana has a debt of Rs.2,83,452 crore

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్‌ 2 నాటికి రూ.75,577 కోట్లుగా ఉన్న రుణాలు ఏటేటా పెరుగుతూ రూ.2.83 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పు, వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, జాతీయ బ్యాంకులు, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలను సంవత్సరాలవారీగా వెల్లడించాలని కోరుతూ నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఫిబ్ర‌వ‌రి 13న‌ లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఈ అప్పుల లెక్కలను వివరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రుణాలేవీ తీసుకోలేదని పేర్కొన్నారు. 2014 జూన్‌ 2 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రూ.2.84 లక్షల కోట్ల నికర అప్పు తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. నికర అప్పుతోపాటు నాబార్డు, వివిధ బ్యాంకుల నుంచి పలు కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ఈ సమాధానంలో కేంద్రం సవివరంగా పేర్కొంది. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర అప్పులు 2016–17లో రూ. లక్ష కోట్ల మార్కు దాటితే 2019–20లో రూ.2 లక్షల కోట్ల మార్కు దాటాయని వెల్లడించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్ల రుణాలు.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 12 జాతీయ బ్యాంకుల నుంచి కార్పొరేషన్లకు రుణాలు లభించినట్లు కేంద్రం లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించింది. ఈ బ్యాంకులన్నింటి ద్వారా 2014 జూన్‌ నుంచి 2022 అక్టోబర్‌ వరకు మొత్తం రూ. 1.28 లక్షల కోట్లను ప్రభుత్వం పూచీకత్తు ఉండి కార్పొరేషన్లకు ఇప్పించిందని తెలిపింది.  
భగీరథకు ‘నిడా’రుణాలు 
నాబార్డు ద్వారా వివిధ నిధుల కింద కూడా తెలంగాణ ప్రభుత్వరంగ కార్పొరేషన్లు రుణాలు తీసుకున్నాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద రూ.7,144 కోట్లు, వేర్‌హౌస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (డబ్ల్యూఐఎఫ్‌) కింద రూ.85,227.94 కోట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఫండ్‌ (ఎఫ్‌పీఎఫ్‌) కింద రూ.1,007.10 కోటు మేర రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. నాబార్డు మౌలిక వసతుల అభివృద్ధి సాయం (నిడా) కింద రూ.11,424 కోట్లను అప్పుగా తీసుకున్నట్లు వివరించింది. 
ఇందులో మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీడీడబ్ల్యూఎస్‌సీఎల్‌) ద్వారా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలోన్లి పలు మండలాలు, సెగ్మెంట్లలో భగీరథ పనులు చేసేందుకు రుణాలు తీసుకున్నారని తెలిపింది. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (కేఐపీసీ) ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కొమురెల్లి మల్లన్న రిజర్వాయర్, నృసింహసాగర్‌ (బస్వాపూర్‌) రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఈ రుణాలు సేకరించినట్లు పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)

తెలంగాణ ఏర్పాటైన తర్వాత తీసుకున్న రుణాలు (సంవత్సరాలవారీగా)

సంవత్సరం

నికర అప్పు

ఆ ఏడాది పెరిగిన అప్పులు (రూ. కోట్లలో)

2014 జూన్‌ 2 నాటికి

75,577

2014–15

83,698

8,121

2015–16

99,213

15,515

2016–17

1,29,532

30,319

2017–18

1,52,190

22,658

2018–19

1,75,281

23,091

2019–20

2,05,858

30,577

2020–21

2,44,019

38,161

2021–22

2,83,452

39,433


నాబార్డు ద్వారా మంజూరైన, తీసుకున్న అప్పులు (2022 అక్టోబర్‌ నాటికి)

నిధి

మంజూరైన రుణం

వచ్చిన రుణం (రూ. కోట్లలో)

ఆర్‌ఐడీఎఫ్‌

8,873

7,144

డబ్ల్యూఐఎఫ్‌

97,278.89

85,227.94

ఎఫ్‌పీఎఫ్‌

2,883.00

1,007.10

నిడా

14,516.65

11,424.66

(నోట్‌: ఈ రుణాలు వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఉండి ఇప్పించినవి. ఇవి కాక వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ. 1.28 లక్షల కోట్లకుపైగా రుణాలను ప్రభుత్వం పూచీకత్తు ఉండి ఇప్పించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇలా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కేంద్ర లెక్కల ప్రకారం రూ. 2.42 లక్షల కోట్ల వరకు ఉన్నాయి) 

Delhi-Mumbai Expressway: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే తొలి దశ ప్రారంభం

Published date : 15 Feb 2023 05:44PM

Photo Stories