Skip to main content

Supreme Court Judges: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది ప్రమాణ స్వీకారం

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.
Supreme Court
సుప్రీంకోర్టు

 సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లో ఆగస్టు 31న సీనియారిటీ ప్రకారం వారితో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ప్రమాణం చేసిన తొమ్మిది మందిలో జస్టిస్‌ విక్రమ్‌నా«థ్, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలు వరుసగా ఫిబ్రవరి 2027 నుంచి మే, 2028 వరకూ ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు తదనంతర కాలంలో సీజేఐలు కానుండటం ఇదే తొలిసారి.

నలుగురు మహిళా న్యాయమూర్తులు
తాజాగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో కోర్టులో ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగు చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి నలుగురు సిట్టింగ్‌ మహిళా న్యాయమూర్తులు ఉండటం కూడా ఇదే తొలిసారి.

ఎవరు ఎప్పటిదాకా సుప్రీంలో...
1.జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. ఆయన పేరెంట్‌ హైకోర్టు బాంబే హైకోర్టు. సుప్రీంకోర్టులో మే 25, 2025 వరకూ సేవలు అందించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో  కూడిన ప్రధాన ధర్మాసనంలో కూర్చొన్నారు.
2. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌: గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయయూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్‌ హైకోర్టు అలహాబాద్‌ హైకోర్టు. ఫిబ్రవరి 2027 నుంచి సుమారు ఏడు నెలలపాటు సీజేఐగా ఉండడనున్నారు. రెండో కోర్టులో జస్టిస్‌ యుయు లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనంలో కూర్చొన్నారు.
3. జస్టిస్‌ జేకే మహేశ్వరి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. పేరెంట్‌ హైకోర్టు మధ్యప్రదేశ్‌ హైకోర్టు. సుప్రీంకోర్టులో జూన్‌ 29, 2026 వరకూ సేవలందించనున్నారు. జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన మూడో ధర్మాసనంలో కూర్చొన్నారు.
4. జస్టిస్‌ హిమా కోహ్లి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్‌ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు. సెప్టెంబరు 2, 2024 వరకూ సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన నాలుగో ధర్మాసనంలో కూర్చొన్నారు.  
5. జస్టిస్‌ బీవీ నాగరత్న: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం 2027లో సీజేఐ కానున్నారు. సెప్టెంబరు 24, 2027 నుంచి అక్టోబరు 30, 2027 వరకూ 36 రోజులపాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్న తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రకెక్కనున్నారు. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ఐదో ధర్మాసనంలో కూర్చొన్నారు.  
6. జస్టిస్‌ సీటీ రవికుమార్‌: కేరళ హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జనవరి 6, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్, జస్టిస్‌ హృషీకేశ్‌రాయ్‌లో కూడిన ఆరో ధర్మాసనంలో కూర్చొన్నారు.  
7. జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌: మద్రాస్‌ హైకోర్టులో మూడో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జులై 21, 2027న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ కృష్ణమురారిలతోకూడిన ఏడో ధర్మాసనంలో కూర్చొన్నారు.  
8. జస్టిస్‌ బేలా ఎం త్రివేది: గుజరాత్‌ హైకోర్టులో ఐదో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జూన్‌ 10, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ఎనిమిదో ధర్మాసనంలో కూర్చొన్నారు.
9. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ: సుప్రీంకోర్టు బార్‌ నుంచి పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం అక్టోబరు 30, 2027 నుంచి మే 2028 వరకూ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన తొమ్మిదో ధర్మాసనంలో కూర్చొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు   : ఆగస్టు 31
ఎవరు    : జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నా«థ్, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సీటీ రవికుమార్, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ
ఎక్కడ    : సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్‌ కాంప్లెక్స్, న్యూఢిల్లీ
ఎందుకు : భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు
 

Published date : 01 Sep 2021 06:46PM

Photo Stories