Skip to main content

Nima Rinji Sherpa: అత్యంత పిన్నవయసులోనే.. 14 పర్వతాల అధిరోహించిన వ్యక్తి ఇత‌నే..

ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులో అధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్‌ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు.
Nepalese Teenager Breaks World Record By Climbing Earths 14 Highest Peaks

అక్టోబ‌ర్ 9వ తేదీ ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్‌ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. 

ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్‌ థౌజెండర్స్‌’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్‌ మౌంటైనీరింగ్, క్లైంబింగ్‌ ఫెడరేషన్‌(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జన్మించిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెప్టెంబర్ 30వ తేదీ పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. 

Maori Crown: మావోరి తెగకు కొత్త రాణి.. 27 ఏళ్ల అమ్మాయి.. ఎవ‌రో తెలుసా..?

అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. ఇప్పటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్‌ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు.

నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి.

Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

Published date : 10 Oct 2024 03:40PM

Photo Stories