Uttarakhand Assembly: ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(యూనిఫామ్ సివిల్ కోడ్–యూసీసీ)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూసీసీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ బిల్లును ఫిబ్రవరి 6న సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఫిబ్రవరి 7న ఆ బిల్లును ఆమోదించారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితోపాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను యూసీసీ బిల్లులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన యూసీసీ బిల్లు గవర్నర్ ఆమోదం పొంది చట్టంగా మారనుంది. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. పోర్చుగీస్ పాలన కాలం నుంచే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.