Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఇటీవల తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని తెలిపింది సుప్రీంకోర్టు. కొత్తగా రాజద్రోహం కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని సూచించింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్ 124అ కింద నమోదైన కేసులన్నింటినీ తిరిగి పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న దేశద్రోహ(సెక్షన్ 124ఏ) చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?’’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది. రాజద్రోహం చట్టాన్ని తిరిగి పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ స్టే విధిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకూ ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది.