Supreme Court: జీఎస్టీ మండలి సిఫార్సులపై సుప్రీం ఆదేశాలు
Telugu Current Affairs - Economy: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సిఫార్సుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మండలి చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. అయితే, మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉంటున్నందున ఆ సిఫార్సులకు తగిన విలువ ఇవ్వాలని పేర్కొంది. జీఎస్టీ సిఫార్సుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఏ ప్రకారం–పన్నుల వ్యవహారాల్లో చట్టాలు చేయడంపై పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన సభలకు సమాన హక్కులు ఉన్నట్లు గుర్తుచేసింది. ఆర్టికల్ 279 ప్రకారం– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదని తెలిపింది. జీఎస్టీ అమల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలకు జీఎస్టీ మండలి పరిష్కార మార్గాలు సూచించాలని ధర్మాసనం తెలిపింది. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదని, కలిసి చర్చించుకోవాలని వివరించింది.