Vande Bharat Trains: 10 ‘వందే భారత్’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అవి తిరిగేది ఎక్కడంటే..?
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలనూ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తోందన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు.
10 రైళ్లు ఇవే..
1. అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్
2. సికింద్రాబాద్ - విశాఖపట్నం
3. మైసూరు - డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై)
4. పాట్నా - లక్నో
5. న్యూ జల్పాయిగురి - పాట్నా
6. పూరీ - విశాఖపట్నం
7. లక్నో – డెహ్రాడూన్
8. కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
9. రాంచీ - వారణాసి
10. ఖజురహో - ఢిల్లీ (నిజాముద్దీన్)
మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్, కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు. మొత్తం 85 వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు.
Underwater Metro: నీటి అడుగున నడవనున్న మెట్రో రైలు.. దీని విశేషాలు ఇవే..
సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో రైలు..
సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా రైలును ప్రారంభించగా.. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం రోజు ఈ రైలు నడవదు.
వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. ఒక రైలు సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య, మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.