Skip to main content

Election Results: ఈశాన్యంలో కమల వికాసం

‘మిషన్‌ నార్త్‌ఈస్ట్‌’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి నూతనోత్తేజం లభించింది.
Northeast assembly election results

ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీ వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్‌ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్‌ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది.

Niti Aayog: నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

త్రిపురలో కాషాయం రెపరెపలు 

Assembly Election Results 2023


త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్‌ కిశోర్‌ దేవ్‌వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్‌ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీకి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్‌టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్‌టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్‌ బ్లాక్, సీపీఐ, ఆర్‌ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్‌ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్‌ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశి‹Ùకుమార్‌ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు.  

మిస్టర్‌ క్లీన్‌కే మళ్లీ కిరీటం!   
త్రిపురలో మిస్టర్‌ క్లీన్‌గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్‌ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్‌ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్‌ దేవ్‌ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్‌ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. 

Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!


నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ–బీజేపీ హవా  

Assembly Election Results 2023


నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీలేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్‌జేపీ(రామ్‌విలాస్‌ పాశ్వాన్‌) 2, ఆర్‌పీఐ(అథవాలే) 2, ఎన్‌పీఎఫ్‌ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల అభ్యర్థులకు ఎన్‌డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. 
చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు  
60 ఏళ్ల నాగాలాండ్‌ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్‌డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్‌–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం.  

Abdul Nazeer: ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

             
మేఘాలయలో హంగ్‌!  

Assembly Election Results 2023


మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్‌ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో  మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్‌ నియోజకవర్గంలో యునైటెడ్‌ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) అభ్యర్థి డొంకుపర్‌ రాయ్‌ లింగ్డో ఫిబ్రవరి 20న మృతి చెందడంతో పోలింగ్‌ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్‌ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ)  అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీకి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్‌  సంగ్మా ప్రభుత్వంలో ఎన్‌పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ(యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్‌ 5, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 04 Mar 2023 03:44PM

Photo Stories