Skip to main content

Niti Aayog: నీతి ఆయోగ్‌ సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

నీతి ఆయోగ్‌ కొత్త సీఈవోగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.
B.V.R. Subrahmanyam

నీతి ఆయోగ్‌ ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌ను ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు సుబ్రహ్మణ్యం ఆ పదవిలో ఉంటారని తెలిపింది. 1987 బ్యాచ్‌ ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీవో) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయ్యర్‌ వాషింగ్టన్‌లో ఉన్న ప్రపంచబ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఈడీగా మూడేళ్ల పాటు పనిచేయనున్నారు. 

సుబ్రహ్మణ్యం విద్యాభ్యాసం.. 
బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రిది ఒడిశాలోని గుణుపురం కాగా తల్లిది కాకినాడ. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీల్లో చ‌దువుకున్నారు. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌లో బీటెక్‌ చేశారు. తర్వాత ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్‌ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ లా అండ్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)

 
2004-08, 2012-15 మధ్యకాలంలో మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోదీల హయాంలో ప్రధాని కార్యాలయం, ప్రపంచ బ్యాంకులోనూ పని చేశారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌కు వెళ్లారు. 2018 జూన్‌లో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో ఆ రాష్ట్ర విభజన సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు. ఆయన సతీమణి ఉమాదేవి భమిడిపాటి ఛత్తీస్‌గఢ్‌ కేడర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారిగా పనిచేసి ఇటీవల కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.

Chandrayaan-3: ‘చంద్రయాన్‌–3’లో కీలక పరీక్ష విజయవంతం

Published date : 21 Feb 2023 01:05PM

Photo Stories