India - Myanmar: భారత్–మయన్మార్ సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారం బంద్
భారత్–మయన్మార్ మధ్య ఫ్రీం మూమెంట్ రెజీమ్ (ఎఫ్‌ఎంఆర్)ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ అంతర్గత భద్రత, ఈశాన్య రాష్ట్రాల జనాభా అంశాల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ.. హోంశాఖ అందజేసిన ప్రతిపాదనపై అంతర్గత వ్యవహారాల విభాగం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా చెప్పారు. ఎఫ్‌ఎంఆర్‌ఫలితంగా రెండు దేశాల సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల భూభాగంలో ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా సంచరించే వెసులుబాటు ఉంది. భారత్–మయన్మార్‌లు సుమారు 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి తీసుకువచ్చిన ఎఫ్‌ఎంఆర్ విధానం.. ప్రస్తుతం మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అమల్లో ఉంది. సరిహద్దుల్లో కంచె నిర్మించాలంటూ.. ఇంఫాల్ లోయలో ఉండే మైతీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు.