Varieties Developed: తెలుగు రాష్ట్రాలకు అనుకూలమైన నూతన వంగడాలు ఇవే..
మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్‌కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.
వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.
జన్యుపరమైన లోపాలకు దూరంగా..
నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.
ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి.