Skip to main content

Army: కార్మికులపై సైనికులు కాల్పులు జరిపిన ఘటన ఏ రాష్ట్రంలో జరిగింది?

Nagaland-Army

బొగ్గు గనిలో పనిచేసే కార్మికులపై సైనికులు కాల్పులు జరిపిన దారుణ ఘటన ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్‌ గ్రామం వద్ద చోటు చేసుకుంది. డిసెంబర్‌ 4న జరిగిన ఈ ఘటనలో మొత్తం 13 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

ఘటన వివరాలు ఇలా..

డిసెంబర్‌ 4వ తేదీన గనిలో పని పూర్తిచేసుకొని వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు కాల్పులు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. జవాన్లు ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరిపారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు.

అందుకే కాల్పులు..

నిషేధిత నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌–ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్‌ ఆంగ్‌ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్‌ఎస్‌సీఎన్‌–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీ’ కోసం సైన్యం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

మయన్మార్‌తో సరిహద్దు..

మోన్‌ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్‌ఎస్‌సీఎన్‌–కేలోని యుంగ్‌ ఆంగ్‌ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది.

‘సిట్‌’ ఏర్పాటు

తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసినట్లు నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియూ రియో ప్రకటించారు. ఈ బృందానికి నాగాలాండ్‌ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు.

హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ బహిష్కరణ..

పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌(ఈఎన్‌పీఓ) ఖండించింది. ఇందుకు నిరసనగా హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫెస్టివల్‌లో పాల్గొనకుండా నల్లజెండాలు ఎగురవేయాలని గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకరషించడానికి నాగాలాండ్‌ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది.
చ‌ద‌వండి: ఏకే–203 రైఫిళ్లను ఎక్కడ తయారు చేయనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
బొగ్గు గనిలో పనిచేసే కార్మికులపై కాల్పులు జరపడంతో 13 మంది మృతి
ఎప్పుడు   : డిసెంబర్‌ 4
ఎవరు    : సైన్యం
ఎక్కడ    : ఓతింగ్‌ గ్రామం, తిరూ ఏరియా, మోన్‌ జిల్లా, నాగాలాండ్‌
ఎందుకు : కార్మికులను నిషేధిత నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌–ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌–కే) తీవ్రవాదులుగా భ్రమపడి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Dec 2021 04:38PM

Photo Stories