Skip to main content

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు రష్యా ప్రకటించింది?

Russia-Ukraine Crisis

ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అధీనంలోని రెండు ప్రాంతాలు ‘‘డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌’’లకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 21న జరిగిన ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్‌ ప్రభుత్వాలు నడుçపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్‌ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్‌ ఇటీవల రష్యాను కోరారు. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని పుతిన్‌ ప్రకటించారు. రెబల్స్‌ నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఐరాస అత్యవసర సమావేశం

పుతిన్‌ ప్రకటన వెలువడగానే ఉక్రెయిన్, అమెరికా తదితర దేశాల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 22న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను 2015 నాటి మిన్‌స్క్‌ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు  ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ సూచించారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్‌ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి.

చర్చలతోనే పరిష్కారం: భారత్‌

ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. ఉద్రిక్తత నివారణే తక్షణ కర్తవ్యమని అభిప్రాయపడింది. అందుకు చర్చలే ఉత్తమ పరిష్కార మార్గమని సూచించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి అన్నారు. ఉక్రెయిన్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. కాగా, సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులంతా తక్షణం వెనక్కు వచ్చేయాలని భారత ప్రభుత్వం మరోసారి సూచించింది.

దేనికీ భయపడబోం: ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌లోని రెబెల్స్‌ అధీనంలోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ ప్రాంతాల్లోకి ఫిబ్రవరి 22న ‘శాంతి పరిరక్షణ’ పేరిట రష్యా భారీ సంఖ్యలో సైన్యాన్ని పంపి.. వాటిని తన అధీనంలోకి తీసుకుంది. ఇది ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారంపై దాడేనని... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ ఈ సంర్భంగా ప్రకటించారు. ‘దేనికీ భయపడబోం. మా భూభాగంలో అంగుళం కూడా వదులుకోం’ అన్నారు.

ఆంక్షల పర్వం

రష్యా తాజా చర్యలపై.. అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను, మర్యాదలను రష్యా తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టాయి. రష్యాపై కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు అమెరికా, యూరప్‌ ప్రకటించాయి.  రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలపై అమెరికా నిషేధం విధించింది. ఇంగ్లండ్‌ ఏకంగా ఐదు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించింది. తమ దేశంలోని ముగ్గురు రష్యా కుబేరుల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు ప్రకటించింది. నాటో సభ్య దేశాలతో కలిసి కనీవిని ఎరగని ఆంక్షలతో విరుచుకుపడతామని రష్యాను హెచ్చరించింది. రష్యాపై విధించాల్సిన ఆంక్షల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు యూరోపియన్‌ యూనియన్‌ కూడా ప్రకటించింది.

చ‌ద‌వండి: బెలారస్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Feb 2022 12:47PM

Photo Stories