Skip to main content

Most Happiest Country In The World: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!.. అక్కడి ప్రజలు ఎలా ఉంటారంటే

World Happiness Index Announcement    Most Happiest Country In The World    UN World Happiness Index  Nordic Happiness
Most Happiest Country In The World

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్‌ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్‌ ఆధారిత వరల్డ్‌ హ్యాపీనెస్ ఇండెక్స్‌ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి.

ఈ జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం కిందకు దిగజారడం గమనార్హం. ఇక చైనా (60), నేపాల్‌ (95), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతోంది అఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యపీనెస్‌ ఇండెక్స్‌ 143 దేశాలలో అఫ్ఘనిస్తాన్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. 

దిగజారిన అమెరికా, జర్మనీ..

ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి  కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్‌ 20లో కోస్టారికా(12), కువైట్(13) స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది టాప్‌ 10లో పెద్ద దేశమేది లేదని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలి టాప్‌ 10లో  1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి.

ఇక టాప్‌ 20లో మాత్రం మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న కెనడా, యూకేలు ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా లేదని పేర్కొంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది.

అగ్రస్థానంలో ఫిన్లాండ్‌ దేశమే ఎందుకంటే..
మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం, ఫిన్‌లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. మొదటిది ఐక్యతా భావం అది ఇక్కడ ఎక్కువ. ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అలాగే  అందరితో సామరస్యంగా జీవించడం వంటివి ఉంటాయి. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్‌లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం.

అంతేగాదు ఫిన్‌లాండ్‌లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతాయని తేలింది. సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఇక్కడ అందరిలోనూ దయ కూడా ఎక్కువే.  రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మూడవది సమానత్వం.  ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల ఇక్కడ పేదరికం ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్‌లాండ్ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్‌లాండ్‌ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి తొలి స్థానంలో కొనసాగుతోంది. 

Published date : 20 Mar 2024 12:17PM

Photo Stories