World's Youngest Billionaire: ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా.. 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి చరిత్ర సృష్టించింది
Sakshi Education
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది.
20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు.
చదవండి: Forbes 2024: ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితా విడుదల.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయస్కురాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది.
కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది.
Published date : 06 Apr 2024 08:45AM