visitors Record: రికార్డ్.. ఈ దేశానికి ఒక్క నెలలో పెరిగిన పర్యాటకుల తాకిడి..!
గత మార్చి నెలలో 30 లక్షల మందికి పైగా విదేశీయులు జపాన్‌ను సందర్శించారని ఆ దేశ ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని పేర్కొన్నారు.
జపాన్‌ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది.
సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.