Skip to main content

జనవరి 2017 అంతర్జాతీయం

Current Affairsశక్తిమంతమైన దేశాల్లో భారత్‌కు 6వ స్థానం
2017లో శక్తిమంతమైన మొదటి 8 దేశాల జాబితాలో భారత్‌కు 6వ స్థానం దక్కింది. ఈ మేరకు అమెరికన్ ఫారిన్ పాలసీ మేగజైన్ నివేదిక విడుదల చేసింది. జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉండగా చైనా, జపాన్ రెండోస్థానంలో సమానంగా నిలిచాయి. రష్యా నాలుగు, జర్మనీ ఐదు, భారత్ ఆరు, ఇరాన్ ఏడు, ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉన్నాయి.

శక్తిమంతమైన మొదటి 8 దేశాలు
1 అమెరికా
2 చైనా, జపాన్
4 రష్యా
5 జర్మనీ
6 భారత్
7 ఇరాన్
8 ఇజ్రాయెల్

ఇస్లామిక్ దేశ పౌరులకు వీసాలు నిలిపివేసిన అమెరికా
ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించిన కార్య నిర్వాహక ఉత్తర్వులపై జనవరి 28న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

ఉత్తర్వుల్లో కీలకాంశాలు
  • ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకూ అమెరికా వీసాలు నిలిపివేత. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇది అమల్లో ఉంటుంది.
  • అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశంపై నివరధిక నిషేధం. వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత.
  • అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు నిలిపివేత.
అమెరికాలోకి 7 ఇస్లామిక్ దేశాల పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్ నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్‌లోకి అమెరికా పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇరాన్ జనవరి 29న ప్రకటన చేసింది.

ఫ్రాన్స్ సుందరి ఇరిస్ మిథెనరికి మిస్ యూనివర్స్ కిరీటం
2017 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫ్రాన్స్ భామ ఇరిస్ మిథెనరి కైవసం చేసుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జనవరి 30న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. హైతీకి చెందిన రక్వెల్ పెలిసీర్ ఫస్ట్ రన్నరప్‌గా, కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఫ్రాన్స్ అయిన 24 ఏళ్ల మిథెనరీ ప్రస్తుతం డెంటల్ సర్జరీలో డిగ్రీ చదువుతోంది. ఈ సారి పోటీల్లో భారత్‌కు చెందిన మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రోష్మితా హరిమూర్తి మొదటి 13 మందిలో స్థానం సంపాదించలేకపోయింది.

హెచ్-1బీ వీసా బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్‌నెస్ యాక్ట్- 2017’ బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ జనవరి 31న ఆమోదం తెలిపింది. అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ఆమోదిస్తే ఈ చట్టం అమల్లోకి వస్తోంది. హెచ్1బీ వీసాతో అమెరికాలో 3.5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా అందులో 1.06 లక్షల మంది తెలుగువారు.

హెచ్-1బీ వేతన సవరణ బిల్లులో ముఖ్యాంశాలు
  • హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని 60 వేల డాలర్లు(రూ.40.80 లక్షలు) నుంచి 1.30 లక్షల డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచాలి. 1989 నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
  • కొత్త చట్టం మేరకు విదేశీ ఉద్యోగులు వేతనాలు పెంచకుంటే వారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి.
  • 50 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు 20 శాతం వీసా కోటా తొలగింపు.
  • హెచ్-1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్‌లకు కేటాయించాలి.

అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
Current Affairs
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం (వాషింగ్టన్ డీసీ) వద్ద అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్.. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్రంప్ రెండు బైబిళ్లపై (ఒకటి తన తల్లి బహూకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ప్రమాణస్వీకారం పూర్తవగానే వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయానికి వెళ్లిన ట్రంప్ ఒబామాకేర్ (హెల్త్‌కేర్ చట్టం) రద్దు ఫైల్‌పైతొలిసంతకం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఫ్రెడ్ ట్రంప్‌కు నాలుగో సంతానంగా జన్మించారు. 1971లో తండ్రి నుంచి వ్యాపార బాధ్యతలు తీసుకున్న ట్రంప్ అనతికాలంలోనే రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్నట్లు 2015లో ప్రకటించిన ట్రంప్ 2016 జూలై 19న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.

బ్రిటన్ పార్లమెంట్‌లో కశ్మీర్‌పై చర్చ
బ్రిటన్ పార్లమెంట్‌లో జనవరి 19న కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. యూకే హౌస్ ఆఫ్ కామన్‌‌సలో జరిగిన చర్చలో.. భారత్-పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవడమే కశ్మీర్ సమస్యకు దీర్ఘకాల పరిష్కారమని, చర్చలు జరిగేలా బ్రిటన్ చొరవ తీసుకోవాలని సభ్యులు కోరారు. లడఖ్, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల కోసం మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని, లడఖ్, జమ్మూ, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మన్ తెలిపారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది.

ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన అమెరికా
ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. సంబంధిత పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 23న సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు(అమెరికా, జపాన్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్, పెరూ, సింగపూర్, బ్రూనై, చిలీ)ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40 శాతం వాటా కలిగి ఉన్నాయి.

పడవ ప్రమాదంలో 180 మంది గల్లంతు
శరణార్థులతో లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న పడవ జనవరి 18న మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 180 మంది గల్లంతయ్యారు. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్లు లెక్కలు పేర్కొంటున్నాయి.

2016లో అత్యధిక ఉష్ణోగ్రతలు
2016లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమెరికాలోని నోవా (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్) శాస్త్రవేత్తలు ప్రకటించారు. కువైట్‌లో ఆసియాలోనే అత్యధికంగా 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా 2016లో భూమి సగటు ఉష్ణోగ్రత 20 శతాబ్దపు సగటు కంటే దాదాపు 1.69 డిగ్రీ ఫారన్‌హీట్ (0.94 డిగ్రీ సెల్సియస్) ఎక్కువైందని వివరించారు. నోవా గణాంకాలను ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించిది.

అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్
2016లో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిలిచింది. ఇది గతేడాది 8.36 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా ఈ గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ, సరకు రవాణా విభాగాల్లో కలిపి అట్లాంటా, బీజింగ్ విమానాశ్రయాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

26 మందికి మరణశిక్షవిధించిన బంగ్లాదేశ్ కోర్టు
Current Affairs 2014లో ఏడుగుర్ని హత్యచేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు 26 మందికి మరణశిక్ష విధించింది. ఈ మేరకు హంతకులను మరణించే వరకు ఉరి తీయాలని నారాయణ్‌గంజ్ జిల్లా, సెషన్‌‌స జడ్జి సయ్యద్ ఇనాయెత్ హొస్సైన్ జనవరి 16న తీర్పు వెలువరించారు. వీరిలో నగర మాజీ కౌన్సిలర్‌తో పాటు, బంగ్లాదేశ్ భద్రతా దళానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులున్నారు. ఒక అధికారి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ కాగా, ఒకరు ఆర్మీ మేజర్, మరొకరు నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్నారు.

కిర్గిస్తాన్ విమాన ప్రమాదంలో 37 మంది మృతి
కిర్గిస్తాన్ రాజధాని బిషెక్ మనాస్‌లో జనవరి 16న జరిగిన విమాన ప్రమాదంలో 37 మంది మృతి చెందారు. టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747-400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి బిషెక్ మీదుగా ఇస్తాంబుల్ వెళుతోంది. మనాస్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా పొగమంచు వల్ల డచాసు గ్రామంలో కుప్పకూలింది.

ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ ఐదోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా, హోచి మిన్ సిటీ(వియత్నాం), సిలికాన్ వ్యాలీ(అమెరికా), షాంఘై(చైనా) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జోన్‌‌స లాంగ్ లాసెల్లే విడుదల చేసిన గ్లోబల్ ‘సిటీ మొమెంటమ్ ఇండెక్స్ (సీఎంఐ)’ ఈ వివరాలు వెల్లడించింది. జీడీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలుండటం, రియల్ ఎస్టేట్ వృద్ధి, కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతులు వంటి 42 అంశాలను పరిగణనలోకి తీసుకుని జేఎల్‌ఎల్ ఈ నివేదిక రూపొందించింది.

జాబితాలో టాప్-10 నగరాలు

నగరం

స్థానం

బెంగళూరు (భారత్)

1

హోచి మిన్ సిటీ (వియత్నాం)

2

సిలికాన్ వ్యాలీ(అమెరికా)

3

షాంఘై(చైనా)

4

హైదరాబాద్ (భారత్)

5

లండన్ (ఇంగ్లండ్)

6

హనోయ్ (వియత్నాం)

7

ఆస్టిన్ (అమెరికా)

8

బోస్టన్ (అమెరికా)

9

నైరోబి (కెన్యా)

10


జాబితాలో ఇతర భారత నగరాలు

పుణె

13

చెన్నై

17

ఢిల్లీ

23

ముంబై

25


లిబియా సముద్ర తీరంలో 180 మంది గల్లంతు
మధ్యధరా సముద్రంలో లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న తూర్పు ఆఫ్రికా శరణార్థుల్లో 180 మంది గల్లంతయ్యారు. జనవరి 14న లిబియా తీరంలో బయలుదేరిన టూటైర్ పడవ మోటారు చెడిపోవడంతో ప్రమాదానికి గురైంది. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు అంచనా.

శక్తిమంతమైన పాస్‌పోర్టుగా జర్మనీ పాస్‌పోర్టు
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో జర్మనీ పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టాన్ కేపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో వీసాఫ్రీ స్కోర్ 157తో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా, 156 స్కోరుతో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ వీసాఫ్రీ స్కోర్ 46 తో భారత్ 78వ ర్యాంకు సాధించింది. చైనా, పాకిస్తాన్‌లు వరుసగా 58, 94 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ అత్యంత తక్కువ స్కోరు (23)తో ఉంది.

ఐసిస్ చీఫ్ అంతానికి ‘కిల్ మిషన్’
Current Affairs
ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలసి బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్‌ఏఎస్) ‘కిల్ మిషన్’ను ప్రారంభిం చింది. ఈ మిషన్ ఎస్‌ఏఎస్ స్నైపర్స్ నేతృత్వంలో సాగుతుంది. అబు బకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం 25 మిలియన్ డాలర్లకు పెంచింది.

సరికొత్త రికార్డు నెలకొల్పిన వ్యోమగామి పెగ్గీ వాట్సన్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు వెళ్లిన ఎక్స్‌పీడిషన్ 50 ఫ్లైట్ ఇంజనీర్ పెగ్గీ వాట్సన్ (56) ఏకంగా ఆరున్నర గంటలపాటు ఐఎస్‌ఎస్ బయట గడిపారు. దీంతో వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన పెద్ద వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.

ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో వంతెన నిర్మించిన చైనా
చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోక లు డిసెంబర్ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీని కోసం సుమారు రూ.1005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్, గిర ప్రావిన్స్‌లను అనుసంధానం చేస్తూ నిర్మించారు.

ప్రపంచంలోనే పొడవైన రైలుమార్గం ప్రారంభించిన చైనా
ప్రపంచంలోనే అత్యంత పొడవైన, వేగవంతమైన రైలుమార్గంను చైనా డిసెంబర్ 28న ప్రారంభమైంది. 2,225 కిలోమీటర్ల మేర షాంఘై నుంచి కున్మింగ్ వరకు ఉండే ఈ మార్గం ఐదు ప్రావిన్స్‌లను కలుపుతూ సాగుతుంది. ఈ మార్గంలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. చైనాలో ప్రస్తుతం మొత్తం 20 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైలుమార్గం ఉంది. 2030 నాటికి దీనిని 45,000 కిలోమీటర్లకు పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

ఆయుధాల కొనుగోళ్లలో భారత్‌కు రెండోస్థానం
అమెరికా నుంచి 2008-15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసెనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008-15 పేరిట డిసెంబర్ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు కోసం భారత్ 34 బిలియన్ డాలర్లు వెచ్చించగా, 93.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలతో సౌదీ అరేబియా తొలిస్థానంలో నిలిచింది.

శ్రీలంక మాజీ ప్రధాని విక్రమనాయకే కన్నుమూత
శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే (83) డిసెంబర్ 27న కన్నుమూశారు. ఆయన రెండు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు.

10 వేల మీటర్ల లోతులో చైనా జలాంతర్గాముల పరిశోధన
పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన మూడు మానవ రహిత జలాంతర్గాములు 10 వేల మీటర్ల లోతులో పరిశోధన జరిపినట్లు పరిశోధకులు డిసెంబర్ 30న ప్రకటించారు. షాంఘై వర్సిటీలోని హడాల్ లైఫ్ సెన్సైస్ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ క్యూ వీచెంగ్ నేతృత్వంలో మరియానా ట్రెంచ్‌లో డిసెంబర్ 25-27 మధ్య ఈ పరిశోధన చేపట్టారు.

Current Affairs2016లో 122 మంది జర్నలిస్టుల మృతి
ప్రపంచ వ్యాప్తంగా 2016లో 122 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది మరణించినట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (ఐఎఫ్‌జే) నివేదిక పేర్కొంది. వీరిలో 93 మంది హత్యకు గురవగా, మిగిలినవారు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలిపింది. అత్యధికంగా ఇరాక్‌లో 15 మంది మరణించగా జాబితాలో 8వ స్థానంలో ఉన్న భారత్‌లో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు.
Published date : 09 Jan 2017 04:25PM

Photo Stories