IWT: సింధు నదీ జలాల ఒప్పందం–సవరణ ప్రతిపాదన
Sakshi Education
సింధు నదీ జలాల ఒప్పందాన్ని(ఐడబ్ల్యూటీ) సవరించుకుందామని ప్రతిపాదిస్తూ భారత్.. పాకిస్థాన్ కు నోటీసు జారీ చేసింది. ఐడబ్ల్యూటీ విషయంలో భారత్, పాక్ మధ్య చాలా కాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ ఒప్పందం అమలు విషయంలో పాక్ మొండిగా వ్యవహరిస్తుండటంతో సింధు నదీ జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా ఈ నెల 25న నోటీసు పంపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం అమలుపై పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో ముందుకు సాగుదామని భారత్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పాక్ బేఖాతరు చేస్తోంది. 2017 నుంచి 2022 వరకు ఐదుసార్లు శాశ్వత ఇండస్ కమిషన్ సమావేశాలు జరిగినప్పటికీ.. ఈ అంశంపై చర్చించేందుకు పాక్ నిరాకరించింది. కిషన్ గంగా, రాటిల్‌జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు పాక్ మొండి కేస్తోంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది.
Published date : 06 Feb 2023 04:43PM