India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..
జనాభాలో చైనాను భారతదేశం దాటేసింది. మన దేశ జనాభా రికార్డు స్థాయిలో 142.86 కోట్లకు చేరింది. 142.57 కోట్ల మందితో ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నిలిచింది. భారత్ కంటే చైనా జనాభా 29 లక్షలు తక్కువగా ఉంది. 34 కోట్ల మందితో అగ్రరాజ్యం అమెరికా అత్యధిక జనాభా కలిగిన మూడో దేశంగా రికార్డుకెక్కింది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్(యూఎన్‌ఎఫ్‌పీఏ) స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్టు–2023ను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ దేశాల జనాభా గణాంకాలను వెల్లడించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
☛ దేశ జనాభాలో 65 ఏళ్లు దాటినవారు 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి చేరుతారని అంచనా. అంటే శతాబ్దాంతం దాకా మనది యువ భారత్‌గానే ఉంటుంది.
☛ జనాభా విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. కేరళ, పంజాబ్‌లో వృద్ధుల జనాభా అధికంగా ఉంది.
Vande Bharat Express: వందేభారత్ రైళ్ల సరాసరి వేగం 83 కిలోమీటర్లు
☛ బిహార్, ఉత్తరప్రదేశ్‌లో యువ జనాభా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
☛ ఐక్యరాజ్యసమితి 1950 నుంచి ప్రపంచ దేశాల జనాభా గణాంకాలను సేకరిస్తోంది.
☛ ఐక్యరాజ్యసమితి జనాభా జాబితాలో భారత్‌కు మొదటి స్థానం దక్కడం ఇదే తొలిసారి.
☛ 1950లో చైనా జనాభా 55.2 కోట్లు కాగా, భారత్ జనాభా 35.3 కోట్లు ఉండేది. అంటే 73 ఏళ్ల తర్వాత చైనాను భారత్ అధిగమించినట్లు స్పష్టమవుతోంది.
☛ 2022లో భారత్ జనాభా 141.2 కోట్లు కాగా, చైనా జనాభా 142.6 కోట్లుగా ఉంది.
☛ 2050 నాటికి భారత్ జనాభా 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
☛ 1950 నుంచి ప్రపంచ జనాభా క్రమంగా పెరుగుతోంది. 2020లో మాత్రం ఈ పెరుగుదల రేటు ఒక శాతం లోపే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
Apple Store: భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సీఈవో టిమ్ కుక్
☛ ప్రపంచ జనాభా గత ఏడాది నవంబర్‌లో 800 కోట్లు దాటిందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది.
☛ ఆధునిక కాలంలో మనుషుల సగటు జీవితకాలం మెరుగవుతోంది. అదే క్రమంలో భారత్‌లో కూడా పురుషుల సగటు ఆయుర్దాయం 71 ఏళ్లు, మహిళల సగటు ఆయుర్దాయం 74 ఏళ్లుగా ఉన్నట్లు నివేదిక తెలియజేసింది.
☛ ప్రపంచ జనాభా ప్రస్తుతం 804.5 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇందులో మూడింట ఒక వంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉండడం గమనార్హం.
☛ చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు అధికంగా ఉంది.
☛ భారత మహిళ తన జీవిత కాలంలో సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తోంది. చైనాలో ఇది 1.2గా, అమెరికాలో 1.6గా ఉంది.