Apple Store: భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సీఈవో టిమ్ కుక్
అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తమ తొలి రిటైల్ స్టోర్‌ను ఏప్రిల్ 18న ఆవిష్కరించింది. ముంబై బీకేసీ(బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో దీన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ స్టోర్‌ను యాపిల్ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. 20,800 చదరపు అడుగులు ఉన్న ఈ స్టోర్‌కు నెలకు రూ.42 లక్షల వరకు(ఏడాదికి రూ.5.04 కోట్లు) అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంది. ఇక ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అద్దె 15 శాతం చొప్పున పెరుగుతుంది. కాగా మొత్తం 3 ఫ్లోర్లను యాపిల్ తన స్టోర్ కోసం తీసుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (05-11 మార్చి 2023)
ఈ సందర్భంగా టిమ్ కుక్ ‘భారత్‌లో మా తొలి స్టోర్ యాపిల్ బీకేసీని ప్రారంభించడం ఆనందంగా ఉంది‘ అని ట్వీట్ చేశారు. యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్) డియెర్‌డ్రె ఓ బ్రియెన్‌తో కలిసి కస్టమర్లను స్వయంగా ఆహ్వానించారు. యాపిల్ రెండో స్టోర్‌ను ఏప్రిల్ 20 న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు.
యాపిల్ దాదాపు పాతికేళ్లుగా భారత్‌లో వివిధ భాగస్వాముల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీకి భారత్‌లో 2,500 మంది సిబ్బంది ఉండగా, తమ యాప్ వ్యవస్థ ద్వారా పరోక్షంగా 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతున్నట్లు అంచనా. చైనా, కొరియా బ్రాండ్ల ఆధిపత్యం ఉన్న దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో ప్రస్తుతం యాపిల్ వాటా సుమారు 3 శాతమే ఉన్నప్పటికీ ఇటీవల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది.