Skip to main content

Earthquake: ట‌ర్కీ, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతుల సంఖ్య‌

ప్రకృతి ప్రకోపానికి ట‌ర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది.

భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ట‌ర్కీ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది.  భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ ట‌ర్కీలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. ట‌ర్కీలోని దియర్‌బకీర్‌, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

భారీగా పెరుగుతున్న మరణాలు..
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 912 మంది మరణించ‌గా, 5300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తెలిపారు. భూకంప తీవ్రతకు ట‌ర్కీలో దాదాపు 3000 భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 326 మంది మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్‌ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 400 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సాయం అందించేందుకు ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు..
తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు స‌హాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్‌ సహా నెదర్లాండ్స్‌, గ్రీస్‌, సెర్బియా, స్వీడన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి. 

Published date : 06 Feb 2023 05:23PM

Photo Stories