Skip to main content

Colombian children: విమాన ప్రమాదంలో త‌ప్పిపోయిన 40 రోజుల త‌రువాత మృత్యుంజయులుగా బయటకి వచ్చిన చిన్నారులు..!

దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్‌ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు.
Four Colombian children found alive after 40 days deep in the Amazon Jungle

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు.

Venice Grand: ఆసక్తికర ఘటన.. రాత్రికి రాత్రే రంగు మారిన కెనాల్ నీరు.. కార‌ణ‌మేమిటంటే..?

చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో
అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్‌ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు.

అసలేం జరిగింది?
అమెజాన్‌ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్‌ ఇంజిన్‌ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్‌ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్‌ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్‌ హోప్‌ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు.

US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి దేవ్ షా

అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్‌ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత  అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్‌లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఎలా మనుగడ సాగించారు?
అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర  క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే  స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో, క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా  హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు.  పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు.

Turkey President Erdogan: టర్కీ ఎన్నికల్లో ఎర్డోగాన్ చారిత్రక విజయం.. 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నిక

Published date : 12 Jun 2023 04:50PM

Photo Stories