Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం 72 మంది దుర్మరణం!
కఠ్మాండు నుంచి టూరిస్టు కేంద్రమైన పొఖారా బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండవడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా కుప్పకూలింది. సెతీ నది ఒడ్డున పొఖారాలోని పాత, కొత్త విమానాశ్రయాలకు సరిగ్గా మధ్యలో నేలను తాకుతూనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దారుణంలో అందరూ మరణించినట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 69 మృతదేహాలను వెలికితీయగా మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లతో పాటు ఆ్రస్టేలియా, ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ నుంచి ఒక్కొక్కరున్నారు. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ 9ఎన్–ఏఎన్‌సీ ఏటీఆర్–72 విమానం 15 ఏళ్ల నాటిది. ఇందులోని ట్రాన్స్‌పాండర్ తదితరాలన్నీ మరీ పాతవని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 పేర్కొంది.
Covid Deaths: చైనాలో 35 రోజుల్లో.. 60 వేల కరోనా మరణాలు
భర్త బాటలోనే...
విమాన ప్రమాదంలో కో పైలట్ అంజూ ఖతీవాడా కూడా మరణించినట్టు భావిస్తున్నారు. ఆమె మృతదేహం ఇంకా దొరకాల్సి ఉంది. అంజూ భర్త పైలట్ దీపక్ పోఖ్రియాల్ కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 16 ఏళ్ల కింద ఆయన నడుపుతున్న యతి ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురై మరణించారు. అయినా వెరవక భర్త తాలూకు బీమా మొత్తంతో అమెరికాలో ఏవియేషన్ కోర్సు చేసి అంజూ కో పైలట్ అయింది. జనవరి 15 నాటి ప్రయాణం ముగిస్తే ఆమె పైలట్‌గా పదోన్నతి పొందేది!