Cheetah Helicopter: కూలిన చీతా హెలికాప్టర్.. ఇద్దరు సైన్యాధికారుల దుర్మరణం
ఈ ఘటనలో హెలికాప్టర్ పైలట్‌గా విధుల్లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి, కోపైలట్‌గా ఉన్న మేజర్ జయంత్ ప్రాణాలు కోల్పోయారు. రక్షణ శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ సన్నద్ధతలో భాగంగా హెలికాప్టర్ అరుణాచల్‌లోని పశ్చిమ కెమాంగ్ జిల్లాలోని సాంగే గ్రామం నుంచి అస్సాంలోని సోనిపట్ జిల్లా మిస్సామరికు తిరుగుపయనమైంది. మార్గమధ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో హెలికాప్టర్ సంబంధాలు తెగిపోయాయి. 9.15 గంటల ప్రాంతంలో బంగ్లాజాప్ గ్రామ శివారులోని కొండల్లో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. హెలికాప్టర్ కూలిన ఘటనపై ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ మొదలుపెట్టింది.
వీవీబీ రెడ్డి యాదాద్రి జిల్లా వాసి
ఈ ప్రమాదంలో అసువులు బాసిన ఉప్పల వినయ్ భానురెడ్డి(వీవీబీ) స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం. 21 సంవత్సరాలుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తూ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. వినయ్ భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.