Skip to main content

ఏప్రిల్ 2021 అంతర్జాతీయం

అఫ్గాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్న దేశం?
Current Affairs
అఫ్గానిస్తాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ ప్రక్రియ 2021, మే 1న ప్రారంభమై సెప్టెంబర్‌ 11 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఏప్రిల్‌ 15న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బైడెన్‌ ఈ వివరాలు తెలిపారు.
బైడెన్‌ ప్రసంగం–ముఖ్యాంశాలు
  • అమెరికా అత్యధిక కాలం చేసిన యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది.
  • ఏటా కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తూ ఒకే దేశంలో వేలాది సైనికులను మోహరించడం అర్థం లేని చర్య.
  • అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొనడం కోసం భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, టర్కీలు మరిన్ని చర్యలు చేపట్టాలి.
  • 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిగిన దాడికి ఇరవై ఏళ్లయ్యేనాటికి అమెరికా, నాటో దళాలు, ఇతర భాగస్వామ్యులు అఫ్గాన్‌ నుంచి వైదొలగుతాయి.
2001 నుంచి...
అఫ్గాన్‌లో 2001 నుంచి కొనసాగుతున్న యుద్ధంతో లక్షల కోట్ల డాలర్ల ఖర్చుతో పాటు దాదాపు 2400 మంది సైనికుల ప్రాణాలను అమెరికా కోల్పోయింది. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి సుమారు 3 వేల అమెరికా బలగాలు అఫ్గాన్‌లో ఉన్నాయి.
భారత్‌కు ఆందోళనకరం
అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలగితే ఆ ప్రాంతం మళ్లీ ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రదేశంగా మారే ప్రమాదముంది. తాలిబన్‌ మళ్లీ మరింత క్రియాశీలమయ్యే అవకాశముంది. అమెరికా తాజా నిర్ణయంతో భారత్‌కు ఉగ్ర ముప్పు మరింత పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుతం జపాన్‌ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జపాన్‌ ప్రధానమంత్రి యోషిహిడే సుగా సమావేశమయ్యారు. అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఏప్రిల్‌ 16న జరిగిన ఈ భేటీలో ఆరోగ్యం రంగం, ప్రపంచంలోని తాజా పరిణామాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్‌ చెప్పేందుకు ఏర్పడిన క్వాడ్‌ కూటమిని మరింతగా బలోపేతం చేయాలని, ఇందుకోసం భారత్, ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు.
మయన్మార్‌ నూతన సంవత్సరం పేరు...
మయన్మార్‌లో సంప్రదాయ తింగ్యాన్‌ కొత్త సంవత్సర సెలవు(ఏప్రిల్‌ 17) సందర్భంగా జైళ్లలో ఉన్న 23,047 మందికి పైగా నిరసన కారుల క్షమాభిక్ష పెట్టి, వారిని విడుదల చేసినట్లు మయన్మార్‌ ఆర్మీ ప్రకటించింది. అందులో 137 మంది విదేశీయులు కూడా ఉన్నారని వెల్లడించింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : జపాన్‌ ప్రధానమంత్రి యోషిహిడే సుగా
ఎక్కడ : వైట్‌హౌస్, వాషింగ్టన్‌ డి.సి, అమెరికా
ఎందుకు : ఆరోగ్య రంగం, తాజా ప్రపంచ పరిణామాలపై చర్చలు జరిపేందుకు

ఏ దేశాధ్యక్షుడు ఇటీవల హత్యకు గురయ్యారు?
మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్‌ దెబీ ఇత్నో(68) హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. తిరుగుబాటు దారుల(రెబల్స్‌)తో పోరు సందర్భంగా ఏప్రిల్‌ 20న యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. 2021, ఏప్రిల్‌ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్రిస్‌ గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురయ్యారు. 18 నెలల ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్‌ ఇద్రిస్‌ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్‌ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఇద్రిస్‌ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు.
చాద్‌ రాజధాని: ఎండ్జమీనా(N'Djamena); కరెన్సీ: సెంట్రల్‌ ఆఫ్రికా సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : హత్యకు గురైన చాద్‌ అధ్యక్షుడు
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు : ఇద్రిస్‌ దెబీ ఇత్నో(68)
ఎక్కడ : చాద్‌
ఎందుకు : తిరుగుబాటు దారుల(రెబల్స్‌)తో పోరు సందర్భంగా

తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్న గల్ఫ్‌ దేశం?
Current Affairs
అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు యూఏఈ ప్రధాని షేక్‌ మొహ్మమద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 10న ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ ఉన్నారు. నౌరా అల్‌ మత్రౌషి, మొహమ్మద్‌ అల్‌–ముల్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ ఎక్కడ ఉంది?
1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్‌ పెట్రోలియం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా అల్‌–ముల్లా ప్రస్తుతం దుబాయ్‌ పోలీస్‌ విభాగంలో పైలట్‌ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ పొందనున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్న గల్ఫ్‌ దేశం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 10
ఎవరు : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)
ఎందుకు : అంతరిక్షంపై మరిన్ని పరిశోధనలు జరిపేందుకు

విషపూరిత అణు జలాలను ఏ సముద్రంలోకి వదిలేయాలని జపాన్‌ నిర్ణయించింది?
2011లో సంభవించిన సునామీ, భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు రియాక్టర్‌లోని విషపూరిత అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి వదిలేయాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికులు, మత్స్య కారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేస్తుండగా ఇంతకంటే ఆచరణాత్మక పరిష్కారం మరోటి లేదని ప్రభుత్వం అంటోంది. రెండేళ్లలో నీటి విడుదలను ప్రారంభించి అది పూర్తయ్యాక, అణు ప్లాంట్‌ను దశలవారీగా మూసివేస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియకు కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా.
అణు రియాక్టర్‌ను చల్లబరిచేందుకు వినియోగించిన సుమారు 1.25 మిలియన్‌ టన్నుల నీరు అణు పదార్థాలతో కలుషితమై ప్రమాదకరంగా మారింది. 2011 నుంచి 1,020 ట్యాంకుల్లో నిల్వ ఉండటంతో లీకేజీ అవుతోంది. వచ్చే ఏడాది చివరికల్లా రియాక్టర్‌లోని ట్యాంకులన్నీ నిండిపోతాయని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ తెలిపింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఫుకుషిమా అణు రియాక్టర్‌లోని విషపూరిత అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : జపాన్‌ ప్రభుత్వం
ఎందుకు : ఇంతకంటే ఆచరణాత్మక పరిష్కారం మరోటి లేదని

హిందూ మహాసముద్రంలో ఫ్రాన్స్‌ నేవీ నిర్వహిస్తోన్న విన్యాసాల పేరు?
Current Affairs
హిందూ మహాసముద్రంలో ‘లా పెరోస్‌’ పేరుతో ఫ్రెంచ్‌ నేవీ విన్యాసాలు ఏప్రిల్‌ 5న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్‌ నావికాదళాలు పాల్గొంటున్నాయి. ఆయా దేశాల యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ప్రదర్శన ఇవ్వనున్నాయి. భారత నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కిల్టన్‌ యుద్ధ నౌకలు, పి81 లాంగ్‌రేంజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పాల్గొంటున్నాయి. వాయు, ఉపరితల యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగం, ఎయిర్‌ డిఫెన్స్, వ్యూహాత్మక యుక్తులు తదితర అత్యాధునిక నావికాదళ విన్యాసాలకు ‘లా పెరోస్‌’ కేంద్రంగా మారనుంది.
ఫ్రాన్స్‌ రాజధాని: పారిస్‌; కరెన్సీ: యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మానుయెల్‌ మాక్రాన్‌
ఫ్రాన్స్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్‌ కాస్టెక్స్‌
ఫ్రాన్స్‌ అధ్యక్ష భవనం పేరు: ఎలీసీ ప్యాలెస్‌
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ‘లా పెరోస్‌’ పేరుతో నేవీ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్‌ 5–7
ఎవరు : ఫ్రాన్స్, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్‌ నావికాదళాలు
ఎక్కడ : హిందూ మహా సముద్రం
ఎందుకు : వ్యూహాత్మక సహకారం కోసం...

మరో రెండుసార్లు అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2036 వరకు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై ఏప్రిల్‌ 5న ఆయన సంతకం చేశారు. పుతిన్‌ ప్రస్తుత పదవీకాలం 2024 వరకు మాత్రమే ఉంది. కాగా, ఆ తర్వాత మరో 12 ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనకు మద్దతుగా 2020 జూలైలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.
రెండు దశాబ్దాలకు పైగా...
68 ఏళ్ల పుతిన్‌.. 2000 సంవత్సరంలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్నారు. సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో కొనసాగారు.
రష్యా...
రాజధాని: మాస్కో; కరెన్సీ: రూబుల్‌
రష్యా అధికార భాష: రష్యన్‌
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు: వ్లాదిమిర్‌ పుతిన్‌
రష్యా ప్రస్తుత ప్రధాని: మైఖేల్‌ మిషుస్తిన్‌

బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ?
బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్‌ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఏప్రిల్‌ 6న జరిగిన ఈ సమాశంలో నిర్మలా మాట్లాడుతూ... విధానపరమైన మద్దతుకుతోడు, అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడం ద్వారా బ్రిక్స్‌ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
భారత్‌ అధ్యక్షతన బ్రిక్స్‌...
2021లో బ్రిక్స్‌కు భారత్‌ అధ్యక్షత వహిస్తోంది. భారత్‌ నేతృత్వంలో 2021 ఏడాది ఇదే మొదటి బ్రిక్స్‌ సమావేశం. బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారాన్ని ఇనుమడింపచేయడం, ఏకాభిప్రాయం కోసం భారత్‌ పనిచేస్తుందని భారత ఆర్థిక శాఖ తెలిపింది.
బ్రిక్స్‌ గురించి...
  • బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా–ఆఖఐఇ ) అనేది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి.
  • బ్రిక్స్‌ దేశాలు 2009 నుంచి ఏటా సమావేశమవుతూ ఆర్థికం, వాణిజ్యం వంటి అనేకాంశాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి.
  • మొదట బ్రిక్‌ (BRIC) గా ఏర్పడిన ఈ కూటమిలో 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో BRICS గా మారింది.
  • గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నీల్‌ 2001లో తొలిసారిగా బ్రిక్‌ అనే పదాన్ని వాడారు.
  • బిక్స్‌ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.
  • 360 కోట్ల జనాభాకు బ్రిక్స్‌ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం. ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్ల ఆన్‌లైన్‌ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ
ఎప్పుడు : ఏప్రిల్‌ 6
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఎక్కడ : ఆన్‌లైన్‌
ఎందుకు : ఆర్థికాంశాల్లో అంతర్జాతీయ సమన్వయాన్ని పెంచుకోవడంపై చర్చలు జరిపేందుకు

జోర్డాన్‌ దేశ రాజధాని నగరం పేరు?
జోర్డాన్‌ రాజ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వెలువడిన వార్తలపై రాజు అబ్దుల్లా–2 తొలిసారిగా స్పందించారు. ఏప్రిల్‌ 7న ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశద్రోహం కుట్రకు తెరపడిందని చెప్పారు. దేశాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్‌ హమ్జాను గృహ నిర్బంధంలో ఉంచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అబ్దుల్లా–2 స్పందిస్తూ తమ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయని స్పష్టం చేశారు.
జోర్డాన్‌...
రాజధాని: అమ్మన్‌; కరెన్సీ: జోర్డానియన్‌ దినార్‌
జోర్డాన్‌ ప్రస్తుత రాజు: అబ్దుల్లా–2 బిన్‌ అల్‌ హుస్సేన్‌
జోర్డాన్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: బిషర్‌ అల్‌–ఖాసావ్నే
Published date : 16 Apr 2021 05:16PM

Photo Stories