Missile Strike: క్షిపణి దాడికి ఒక్క నిమిషం చాలు.. మాజీ బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్–రష్యా యుద్ధం తొలినాళ్లలో పుతిన్‌కు, బోరిస్‌కు మధ్య జరిగిన ఫోన్‌కాల్ సంభాషణలు, పశ్చిమ దేశాలతో పుతిన్ నేతృత్వంలోని రష్యా వైఖరిని వెల్లడిస్తూ బీబీబీ ‘పుతిన్ వర్సెస్ ది వెస్ట్’ పేరిట ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. బీబీసీతో బోరిస్, బ్రిటన్ రక్షణ మంత్రి, పలువురు తెలిపిన వివరాలతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ జనవరి 30వ తేదీ ప్రసారమైంది.
డాక్యుమెంటరీ వెల్లడించిన విషయాల్లో కొన్ని..
• యుద్ధం మొదట్లోనే అంటే గత ఏడాది ఫిబ్రవరిలో పుతిన్‌కు బోరిస్ ఫోన్‌చేశారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు స్వస్తి పలకాలని హితవు పలికారు. దానికి ససేమిరా ఒప్పుకోని పుతిన్ ఏకంగా బోరిస్‌ను బెదిరించారు!. ‘ బోరిస్.. మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదుగానీ క్షిపణితో(అలాంటి) దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు నాకు. ఇది త్వరలో వర్తమానప్రపంచంలో దారుణ విపత్తుగా పరిణమించబోతోంది’ అని అన్నారు.
• బోరిస్ సంయమనం కోల్పోకుండా చర్చలకు ప్రాధాన్యమిస్తూనే దీటుగా బదులిచ్చారు.
• ‘వెనక్కి వెళ్లకపోతే రష్యాపై పశ్చిమ దేశాలు అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తాయి. నాటో సేనలు రష్యా సరిహద్దులను చుట్టుముడతాయి. సరైన భవిష్యత్తు లేనపుడు ఉక్రెయిన్ నాటోలో చేరబోదు’ అని అన్నారు.
• బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్ కూడా మాస్కోకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం రాబోతోందని ఆనాడే అంచనావేశారు.
• పుతిన్, బోరిస్ తాలూకు ఈ ఫోన్‌కాల్ వివరాలను బ్రిటన్ ప్రధాని కార్యాలయం, రష్యా అధికారికంగా ఎప్పుడూ వెల్లడించకపోవడం గమనార్హం.