Skip to main content

అక్టోబర్ 2018 అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు రెండోస్థానం
Current Affairs అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయ విద్యార్థులకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ నివేదికను అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ విభాగం అక్టోబర్ 26న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో అమెరికాలో 2,49,763 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ జాబితాలో 4,81,106 మంది విద్యార్థులతో చైనా తొలిస్థానంలో నిలవగా, దక్షిణకొరియా(95,701), సౌదీ అరేబియా(72,358), జపాన్(41,862) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు 24 నెలల గడువుండే సైన్స్-టెక్నాలజీ-ఇంజనీరింగ్-గణితం(స్టెమ్) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ)లో భారతీయ విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికాలో స్టెమ్ డిగ్రీ విద్యార్థులకు అదనంగా ఉండే ఈ కోర్సులో 2017లో 89,839 మంది విదేశీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో భారతీయులు(53,507 మంది) తొలిస్థానంలో ఉండగా, చైనీయులు(21,705), దక్షిణకొరియా (1,670), తైవాన్(1,360), ఇరాన్(1,161) విద్యార్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో భారతీయ విద్యార్థులకు రెండోస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ విభాగం

శ్రీలంక పార్లమెంటు రద్దు
శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అక్టోబర్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరచాలని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ సిరిసేనకు లేఖ రాయగా అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విక్రమ సింఘేనే ప్రధాని...
రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ జయసూర్య అక్టోబర్ 28 ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుంద ని జయసూర్య అన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు.
2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునెటైడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునెటైడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శ్రీలంక పార్లమెంటు రద్దు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ : జీటీటీఐ
సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ మారుతోందని ‘‘హ్యూమానిటీ ఎట్ రిస్క్ - గ్లోబల్ టై్ థ్రెట్ ఇండికెంట్’’(జీటీటీఐ) నివేదిక పేర్కొంది. ఎక్కువ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ, సహాయపడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో మానవాళికి ముప్పు ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం 200 ఉగ్రసంస్థలపై అధ్యయనం చేసి రూపొందించిన జీటీటీఐ రిపోర్టును ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్‌లు సంయుక్తంగా అక్టోబర్ 27న విడుదల చేశాయి.
అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న పాకిస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయని, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల వల్ల అంతర్జాతీయ భద్రతకు పెను ముప్పు ఉన్నట్లు జీటీటీఐ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, పాకిస్థాన్ సహకారంతో అవి పని చేస్తున్నాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : హ్యూమానిటీ ఎట్ రిస్క్ - గ్లోబల్ టై్ థ్రెట్ ఇండికెంట్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

కాలుష్యం కారణంగా 6 లక్షల మంది మృత్యువాత
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 29న ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఆరోగ్యం-వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ఈ నివేదికను రూపొందించారు.
ఈ నివేదిక ప్రకారం నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది అంటే 180 కోట్ల మంది కలుషిత గాలిని పీలుస్తున్నారు. వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు ఉన్నారు. 2016లో దాదాపు 6 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులకు గురై చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా టీఏ ఘెబ్రెయ్‌సస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : వాయు కాలుష్యం కారణంగా

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం
ఇండోనేషియాలో అక్టోబర్ 29న ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి అక్టోబర్ 29న 189 మందితో పంగ్‌కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన ‘లయన్ ఎయిర్’ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్ సముద్ర తీరానికి దగ్గర్లో విమానం సముద్రంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన ‘బోయింగ్ -737 మాక్స్’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది (మొత్తం 189 మంది) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోయింగ్ -737 మాక్స్’ జేటీ 610 విమాన ప్రమాదం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎక్కడ : జావా సముద్రం, ఇండోనేషియా

అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
Current Affairs ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనగా గుర్తింపు పొందిన ‘హాంకాంగ్- జుహయి’ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 23న అధికారికంగా ప్రారంభించారు. పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్- జుహయి- మకావో పట్టణాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 55 కి.మీ కాగా, ఇందులో 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది. ప్రస్తుతం హాంకాంగ్ నుంచి జుహయికి ప్రయాణ సమయం 3 గంటలు కాగా, ఈ వంతెన వల్ల అది 30 నిమిషాలకు తగ్గనుంది. 2009లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.47 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దీనిపై వాహనాలు నడ పాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎక్కడ : పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్- జుహయి- మకావో, చైనా

అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాషగా తెలుగు
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాషగా తెలుగు భాష నిలిచింది. ఈ మేరకు 2010-17 కాలంలో అమెరికాలో ఇంగ్లీషు మినహా ఇతర భాషలపై అధ్యయనం చేసిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ అక్టోబర్ 22న వెల్లడించింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010-17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది.
అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-10 భాషల్లో ఏడు దక్షిణాసియా భాషలు ఉన్నాయి. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు. అందులో అధికంగా స్పానిష్ మాట్లాడేవారున్నారు. యూఎస్‌లో భారతీయ భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు అధికంగా ఉండగా తర్వాతి స్థానంలో గుజరాతీ మాట్లాడేవారున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాషగా తెలుగు
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ

మలేషియాలో మరణశిక్ష రద్దు
Current Affairs మలేషియాలో మరణశిక్ష త్వరలో రద్దు కానుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేయాలని మలేషియా ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం అక్టోబర్ 11 నిర్ణయించింది. దీంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్‌‌స అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణశిక్షను రద్దు చే శాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలేషియాలో మరణశిక్ష రద్దు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : మలేషియా ప్రధాని మహతీర్ మొహమ్మద్

ఐరాస మండలి’ ఎన్నికల్లో భారత్ గెలుపు
ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో సభ్యదేశాల ఎంపిక కోసం అక్టోబర్ 12న జరిగిన ఎన్నికలో భారత్ విజయం సాధించింది. దీంతో 2019 జనవరి1 నుంచి మూడేళ్లపాటు భారత్ ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఉండనుంది. సభ్యత్వం కోసం ఎన్నికల్లో విజయం సాధించేందుకు 97 ఓట్లు అవసరమవ్వగా, ఆసియా పసిఫిక్ కేటగిరీలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఫిజి దేశాలతో పోటీపడి భారత్ 188 ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది. పోటీలో పాల్గొన్న అన్ని దేశాల కన్నా భారత్‌కే అత్యధిక ఓట్లు పడ్డాయి. రహస్య పద్ధతిలో ఓటింగ్ జరగ్గా మొత్తం 18 దేశాలు ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యత్వానికి అవసరమైనన్ని ఓట్లు సాధించాయి. 2011-14, 2014-17 మధ్య భారత్ రెండుసార్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికై ంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఎంపిక
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : భారత్

ఎస్‌సీఓ సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రభుత్వ విభాగాధిపతుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. తజకిస్థాన్ రాజధాని డుషన్‌బేలో అక్టోబర్ 12న జరిగిన ఈ సదస్సులో సుష్మా మాట్లాడుతూ... అభివృద్ధికి ఉగ్రవాదం అవరోధంగా నిలిచిందన్నారు. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ పారదర్శకత, సుపరిపాలన, ప్రాదేశిక సమైక్యత, సంప్రదింపులే ప్రాతిపదికగా దేశాల మధ్య కనెక్టివిటీని పెంచుకోవాల చెప్పారు. సీపీఈసీని 50 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో పాకిస్థాన్-చైనా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌సీఓ సభ్యదేశాల ప్రభుత్వ విభాగాధిపతుల సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
ఎక్కడ : డుషన్‌బే, తజకిస్థాన్

ఐపీసీసీ నివేదికను విడుదల చేసిన ఐరాస
Current Affairs ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అనే ప్రత్యేక నివేదికను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అక్టోబర్ 8న విడుదల చేసింది. ప్రపంచదేశాలు గ్లోబల్‌వార్మింగ్‌ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఈ నివేదికలో ఐరాస పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్, పాకిస్తాన్‌లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. భారత్‌లోని తీరప్రాంత నగరమైన కోల్‌కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పింది.
విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని ఐరాస తన నివేదికలో వెల్లడించింది. ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే అతివృష్టి, అనావృష్టి సంభవించడంతోపాటు అంటువ్యాధులు విజృంభిస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి.
గత 150 ఏళ్లలో పెరిగిన ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్‌లో)

ఢిల్లీ

1

ముంబై

0.7

కోల్‌కతా

1.2

చెన్నై

0.6

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక విడుదల
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఐక్యరాజ్యసమితి

న్యూయార్క్‌లో సార్క్ విదేశాంగ మంత్రుల సదస్సు
Current Affairs అమెరికాలోని న్యూయార్క్‌లో సార్క్ విదేశాంగ మంత్రుల సదస్సు-2018 ను సెప్టెంబర్ 28న నిర్వహించారు. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ.... దక్షిణాసియా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రాంతీయ సహకారం తప్పనిసరన్నారు. ప్రపంచానికే ఏకై క అతి పెద్ద ముప్పుగా ఉగ్రవాదం పరిణమించిందన్నారు. 2017, మే నెలలో ప్రయోగించిన సార్క్ ఉపగ్రహాన్ని (సౌత్ ఏసియా శాటిలైట్) ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఈ తరహా ప్రయోగం జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లోని ప్రజలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుంద ని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సార్క్ విదేశాంగ మంత్రుల సదస్సు-2018
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
Published date : 24 Oct 2018 03:34PM

Photo Stories