Israel Attacks Lebanon: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఒకే రోజు 356 మంది మృతి.. 1,024 మందికి గాయాలు!!
ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలతో సహా 356 మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది.
సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్‌లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది.
గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా. సెప్టెంబర్ 20వ తేదీ లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు.
17, 18వ తేదీల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా 22వ తేదీ హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.
దాడులు మరింత తీవ్రం..
రాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది.
దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు.
Russia Attack Ukraine: పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్.. 100 క్షిపణులు, డ్రోన్లు..!