Skip to main content

Telangana Budget 2023‌-24 Highlights: తెలంగాణ బడ్జెట్ 2023‌-24

తెలంగాణ బడ్జెట్ 2023-24ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఫిబ్రవరి 6వ తేదీ (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Telangana Budget 2023‌-24
Telangana Budget 2023‌-24

వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు ప్రాధాన్యం, పల్లె, పట్టణ ప్రగతుల నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే బదిలీ చేసేందుకు అవకాశం.. సంక్షేమ పథకాలు యథాతథం.. విద్యుత్ సబ్సిడీలకు నిధుల పెంపు.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత.. మొత్తం మీద 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్లో ఈ రెండు శాఖలకు కలిపి ఏకంగా రూ.60 వేల కోట్ల వరకు కేటాయించింది.

ఇక బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలకు నిధులను ఆశించిన మేరకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధితో పాటు సొంత పన్నుల ఆదాయాన్ని ఆసరాగా చేసుకుని, కేంద్రంపై ఆశలు వదులుకోకుండానే, రుణాలను పెద్దగా పెంచకుండానే, ఆర్థికాభివృద్ధికి సూచిక అయిన మూలధన వ్యయానికి 40 శాతం మేరకు నిధులు పెంచింది. ఈ మేరకు బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే, సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద చూపెట్టడం ఈ బడ్జెట్లోనే హైలెట్గా చెప్పుకోవచ్చు.  

రహదారుల నిర్వహణ, మరమ్మతులకు నిధులు 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులకు అదనంగా మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.2,000 కోట్లను ప్రతిపాదించింది. వీటితో పాటు ఆర్అండ్బీ శాఖకు (బీటీ రెన్యువల్స్) అదనంగా మరో రూ.2,500 కోట్లను ప్రతిపాదించింది. పల్లె ప్రగతి కింద రూ.3,360 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.1,474 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకే ఇవ్వనుంది.

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ నిధులు వెచ్చించామని, అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే స్థానిక ప్రజాప్రతినిధుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను గ్రీన్చానల్ (ట్రెజరీ ఆంక్షలు లేకుండా) విధానంలో పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వెచ్చించనున్నారు. గతంలో టీయూఎఫ్ఐడీసీ కింద మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.300 కోట్లను కూడా నేరుగా బడ్జెట్లోనే కేటాయించడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించడం విశేషం.  

వ్యవసాయానికి ఊతం 
బడ్జెట్లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చూపెట్టింది. వ్యవసాయ, సహకార రంగాలకు ఈసారి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబంధు కింద 2022–23లో రూ.14,800 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు ఎక్కువ చూపెట్టింది. తాజా బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.6,380 కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసేందుకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేసినప్పటికీ రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రైతు బీమా కోసం రూ.123 కోట్లు, మత్స్యశాఖకు రూ.100 కోట్లు చూపెట్టిన ప్రభుత్వం.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి, ఎన్సీడీసీ ఇచ్చే రూ.4,500 కోట్ల రుణం ద్వారానే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పకనే చెప్పింది.  

సంక్షేమం యధాతథం 
బీఆర్ఎస్ మార్కు సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్లో కూడా తగిన ప్రాధాన్యత లభించింది. కల్యాణలక్ష్మీ, షాదీముబాకర్లకు రూ.3,210 కోట్లు (గత ఏడాది కంటే రూ.460 కోట్లు ఎక్కువగా) చూపెట్టింది. విద్యుత్ సబ్సిడీల (వ్యవసాయం, హెయిర్ సెలూన్లు, ఇస్త్రీ షాపులకు ఇచ్చే సబ్సిడీలు) రూపంలో గత బడ్జెట్ కంటే అధికంగా రూ.12 వేల కోట్లు, ఉచిత బియ్యం పంపిణీకి రూ.213 కోట్లు అదనంగా రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.919 కోట్లు ఎక్కువగా రూ.5,609 కోట్లు కేటాయించింది. కొత్తగా న్యూట్రిషన్ కిట్ల కోసం 33 జిల్లాలకు గాను రూ.200 కోట్లను ప్రతిపాదించింది.

గత బడ్జెట్లో కేటాయించిన విధంగానే దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు గత బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు చూపెట్టింది.  బడ్జెటేతర నిధుల నుంచి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు అదనంగా ‘సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు’ పథకానికి కూడా నిధులు కేటాయించింది. గృహా నిర్మాణ పథకానికి ఈ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించగా, ఇందులో సొంత జాగాల ఇళ్లకు రూ.7,890 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సీఎం విచక్షణ మేరకు మరో 25 వేల మందిని ఎంపిక చేస్తారు. కొత్త తాయిలాలు పెద్దగా లేకపోగా.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016 ఇచ్చే పథకాన్ని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రతిపాదించకపోవడం గమనార్హం.  

విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం 
బడ్జెట్లో నిధులు ఆశించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చూపెట్టారు. విద్యాశాఖకు రూ.19 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.12,161 కోట్లు ప్రతిపాదించారు. వీటితో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ.11,495 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.22,260 కోట్లు చూపెట్టారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.31 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1,000 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, ఐఅండ్పీఆర్కు రూ.1,000 కోట్లు, ఎయిర్పోర్ట్–మెట్రో అనుసంధానానికి రూ.500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు కేటాయించగా, అందులో కొత్త నియామకాలకు అవసరమయ్యే వేతనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.  

ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరణ 
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సెర్ప్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణను కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. అయితే వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. 

రూ. 2.37 లక్షల కోట్ల మేర అంచనా సవరణ 
 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఏడాది మార్చి 6వ తేదీన రూ.2.56 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి రూ.2,37,884.55 కోట్లుగా సవరించారు. అంటే ప్రతిపాదించిన మొత్తం కంటే రూ.19 కోట్ల వరకు లోటు తేలిందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో ఎఫ్ఆర్బీఎం పేరుతో కేంద్రం విధించిన నిబంధనల వల్లే రూ.13 వేల కోట్లు నష్టపోయామని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదిస్తే చాలా తక్కువగా కేంద్రం ఇస్తోందని, పన్నుల్లో వాటా తగ్గిస్తోందని చెప్పిన ప్రభుత్వం.. సవరించిన అంచనాల్లో మాత్రం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధులను భారీగానే చూపెట్టడం గమనార్హం.  

పంచ సూత్రతోనే ఖజానాకు కిక్కు 
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.2.90 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్కు అనుగుణంగా ఖజానా నింపేందుకు ఐదు పద్దులు దోహద పడనున్నాయి. ఇందులో సొంత పన్ను ఆదాయ పద్దు కింద రూ.1.31 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపి దాదాపు రూ.62,500 కోట్లు, రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు, పన్నేతర ఆదాయం కింద (భూముల అమ్మకాలతో కలిపి) రూ.22,808 కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.20 వేల కోట్లు సమకూర్చుకునేలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. 
 

2023–24 బడ్జెట్‌  అంచనాలివే (అంకెలు రూ.కోట్లలో)

మొత్తం బడ్జెట్

2,90,396.00

రెవెన్యూ రాబడి

2,16,566.97

రెవెన్యూ వ్యయం

2,11,685.23

రెవెన్యూ మిగులు

4,881.74

పన్ను రాబడి

1,31,028.65

పన్నేతర రాబడి

22,808.31

కేంద్ర పన్నుల్లో వాటా

21,470.84

గ్రాంట్ఇన్ఎయిడ్

41,259.17

రుణాలు

40,615

మూలధన వ్యయం

37,524.70

ద్రవ్యలోటు

38,234.94

 

మొత్తం బడ్జెట్రూ.2.90 లక్షల కోట్లు..

కేటాయింపులు...  

(రూ.కోట్లలో)

ఆర్థిక శాఖ  

49,749

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి  

31,426

నీటి పారుదల శాఖ  

26,885

వ్యవసాయం, సహకారం

26,831

రహదారులు, భవనాల శాఖ  

22,260

షెడ్యూల్కులాల అభివృద్ధి

21,022

పాఠశాల విద్య, సచివాలయం

16,902

విద్యుత్రంగం

12,737

ప్రణాళిక శాఖ

11,495

వైద్య, ఆరోగ్యం

12,161

పురపాలక శాఖ

11, 372

హోం శాఖ  

9,599

బీసీ సంక్షేమం

6,229

పరిశ్రమలు, వాణిజ్యం

4.037

గిరిజన సంక్షేమం

3,965

రెవెన్యూ శాఖ

3,560

ప్రజా పంపిణీ వ్యవస్థ

3,117

ఉన్నత విద్య

3,001

మైనారిటీ సంక్షేమం

2,200

మహిళా శిశు సంక్షేమం

2,131

పశు, మత్స్య శాఖ              

2,071

న్యాయ శాఖ

1,665

రవాణా శాఖ

1,644

సాధారణ పరిపాలన శాఖ

1,491

పర్యావరణ, అడవులు, సైన్స్

1,471

యువజన సర్వీసులు, పర్యాటకం

1,117

కార్మిక, ఉపాధి శాఖ

542

సమాచార, కమ్యూనికేషన్స్శాఖ

366

శాసన వ్యవస్థ

168

 

‘సాగు’ నిధుల్లో సగానికిపైగా అప్పులకే 
రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చూపినా.. నిధుల్లో సింహభాగం రుణ కిస్తీలు, వడ్డీల చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 2023–24లో నీటి పారుదలశాఖకు నిర్వహణ పద్దు కింద రూ.17,504.1 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.8942.86 కోట్లు కలిపి మొత్తం రూ.26,446 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో చేసిన రూ.22,675 కోట్ల కేటాయింపులతో పోల్చితే ఇది రూ.3,771 అదనం. తాజా కేటాయింపుల్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.7,715.89 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.335.58 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.1,301.58 కోట్లు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.256.56 కోట్లను చూపారు. 
నిర్వహణ పద్దు అప్పులకే.. 
తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద చూపిన రూ.17,504 కోట్లలో ఏకంగా రూ.15,700 కోట్లు రుణ వాయిదాలు, వడ్డీల చెల్లింపులకే పోనున్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది బడ్జెట్లో రూ.11,745 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది మరో రూ.3,955 కోట్లు పెరిగాయి. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ కొత్త రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉందని అధికార వర్గాలే చెప్తున్నాయి. 

రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇవీ.. (రూ.కోట్లలో)

కాళేశ్వరం

                2,614

పాలమూరురంగారెడ్డి

                1,187

సీతారామ

                948

డిండి

                250

కల్వకుర్తి

               212

నెట్టెంపాడు

                120

ఎస్ఎల్బీసీ

                250

ఎల్లంపల్లి

                349

దేవాదుల

                285

చనాకాకొరట

                289

ఫ్లడ్ఫ్లో కెనాల్

                219

నిజాంసాగర్

                146

నాగార్జునసాగర్

                147 

ఎస్సారెస్పీ వరద కాల్వ

                300

TS Budget savarana


2022–23లో క్షీణించనున్న జాతీయ, రాష్ట్ర వృద్ధి రేటు 
రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది.
స్థిర ధరల వద్ద 7.4 %
దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. 
తగ్గిన నిరుద్యోగం
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి.

పెరిగిన ఉద్యోగ భద్రత
సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం
• స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. 
• జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది.
• 2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు రూ.3210 కోట్లు

Kalyana Lakshmi


‘కల్యాణ’ కానుకకు 2023– 24 బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. క్షేత్రస్థాయి నుంచి సాయం అందుకునే వారి సంఖ్య పెరుగు తుండడంతో కేటాయింపులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లకు రూ.3210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.2750 కోట్లు కేటాయించగా.. ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.460 కోట్లు పెంచింది. తాజా కేటాయింపులతో 3.20లక్షల మందికి కల్యాణ కానుక అందనుంది.

కేటాయింపులు(రూ.కోట్లలో)               

సంక్షేమ శాఖ

2022–23

2023–24

బీసీ

1850

200

ఎస్సీ

400

500

మైనారిటీ

300

450

గిరిజన

200

260

 

తలసరి అప్పు.. రూ.98,033 
రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరువైంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో తీసుకునేవి కలిపి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,57,059 కోట్లకు (పూచీకత్తు రుణాలు కాకుండా) చేరనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే..  ఒక్కొక్కరి తలపై అప్పు రూ.98,033కు చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర అంచనాల మేరకు తలసరి అప్పు రూ.94 వేలు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు వేలు పెరుగుతోంది. ఇక ప్రభుత్వం పూచీకత్తులు ఇచ్చి కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలనూ కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 
జీఎస్డీపీతో పోలిస్తే తగ్గుదల
కాగా, రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన బడ్జెట్ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పుల శాతం తగ్గుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీఎస్డీపీలో 25.4 శాతం అప్పు ఉండగా, అదే 2023–24 సంవత్సరం ముగిసే సమయానికి ఇది జీఎస్డీపీలో 23.8 శాతానికి తగ్గుతుండడం గమనార్హం. ఇదే క్రమంలో 2021–22, 2022–23 సంవత్సరాల్లో కూడా జీఎస్డీపీలో అప్పుల శాతం తగ్గిందన్నమాట.
వడ్డీల చెల్లింపులకే రూ.22,407 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.22,407.67 కోట్లు చెల్లించనుంది. 2022–23లో వడ్డీల కింద రూ.18,911 కోట్లు చెల్లించగా.. ఈసారి మరో రూ.3,500 కోట్ల మేర పెరిగాయి.
• ఇక రుణాల తిరిగి చెల్లింపుల కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.12,606 కోట్లను చూపింది. ఇందులో ప్రజా రుణం కింద రూ.9,341.17 కోట్లు,, కేంద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.427.16 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,837.76 కోట్లు తిరిగి చెల్లించనుంది.

తగ్గిన పూచీకత్తు రుణాలు! 
2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23లో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలకు రుణాల కోసం ప్రభుత్వమిచి్చన పూచీకత్తులు తగ్గిపోయాయి. 2021–22 ముగిసే నాటికి ప్రభుత్వ పూచీకత్తులు మొత్తం రూ.1,35,282.51 కోట్లు ఉండగా.. 2022–23లో రూ.1,29,243.60 కోట్లకు తగ్గాయి. పూచీకత్తు ఇచ్చి కార్పొరేషన్లు, సంస్థల పేరిట తీసుకునే రుణాలనూ ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామన్న కేంద్ర నిబంధనే దీనికి కారణం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ కార్పొరేషన్కూ పూచీకత్తు ఇవ్వలేదు. ఇదే సమయంలో గత ఏడాది ఇచి్చన పూచీకత్తుల అసలులో కొన్ని నిధులు చెల్లించడంతో.. 2022–23లో ప్రభుత్వ గ్యారెంటీలు రూ.6 వేల కోట్ల మేర తగ్గాయి. మొత్తంగా పూచీకత్తులతో కలిపి రాష్ట్ర రుణం రూ.4,52,235 కోట్లకు చేరడం గమనార్హం.  

Rupee come and go

 

గత రెండేళ్లలో రాష్ట్ర అప్పుల గణాంకాలివీ.. (రూ.కోట్లలో)

తీసుకున్నవి                                                                          తిరిగి చెల్లించినవి                                   ఇంకా ఉన్న అప్పు

రుణ వనరు

2021–22

2022–23

2021–22

2022–23

2021–22

2022–23

బహిరంగ మార్కెట్

45,716

44,970

6,460.42

8,336.00

2,42,454.86

2,79,088.86

కేంద్రం ఇచ్చినవి

214.14

3,852.00

509.92

367.94

7,498.79

10,982.85

ఎన్ఎస్ఎస్ఎఫ్

827.30

827.30

6,377.77

5,550.46

ఆర్థిక సంస్థలు/బ్యాంకులు

1,278.53

1,500.00

1,044.79

2,070.66

14,208.23

13,637.57

ప్రావిడెంట్, బీమా నిధులు

2,658.66

3,006.74

1,591.63

2,185.72

12,912.19

13,733.21

మొత్తం

49,867.33

53,328.74

10,434.05

13,787.62

2,83,451.84

3,22,992.95

 

2016–17 నుంచి రాష్ట్ర అప్పుల తీరు.

సంవత్సరం

రుణాలు

జీఎస్డీపీలో శాతం

2016–17

1,29,531

20.04

2017–18

1,52,190

20.21

2018–19

1,75,281

20.25

2019–20

2,05,858

21.32

2020–21

2,44,019

25.04

2021–22

2,83,452

24.07

2022–23

3,22,993

24.30

2023–24

3,57,059

23.80

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు 

Teacher


రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి చదివింపులు పెరిగాయి. అక్షరాలా రూ.19,093 కోట్లు కేటాయించారు. గతేడాది (2022–23) రూ.16,043 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.3,050 కోట్ల మేర పెరిగాయి. పాఠశాల విద్యకు రూ.16,092 కోట్లు ఇవ్వగా, ఉన్నతవిద్యకు రూ.3,001 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో చాలావరకూ ఉద్యోగుల వేతనాలు, సంస్థల నిర్వాహణకే సరిపోతుంది. ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. దీంతో ప్రమోషన్లు పొందే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలు, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలు కలుపుకుని పాఠశాలవిద్యలో దాదాపు 18 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన నిధుల అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదు. ఉన్నతవిద్యకు అత్తెసరుగానే నిధులు కేటాయించారు. సాంకేతిక, కళాశాల విద్యకు నిధులు తగ్గాయి. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు, గతేడాది ప్రకటించిన మహిళావర్సిటీకి కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. గతేడాది మహిళావర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించినా, అవి ఖర్చవ్వలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు–మనబడి’పథకానికి ప్రణాళికేతర పద్దుల్లో నిధులు ఖర్చుచేయాలని నిర్ణయించారు.   
కొన్ని ముఖ్యాంశాలు 
• ఆంగ్ల మాధ్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణకు నిధులు పెంచారు. పాఠశాల విద్యలో గతంలో రూ.32.07 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ. 73.07 కోట్లకు పెంచారు.  
• కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో నిర్వహించే సమగ్ర శిక్షా అభియాన్‌కు రాష్ట్రవాటాను రూ.799.91 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచారు. 
• అసంపూర్తిగా ఉన్న మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి నిధులను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. 
• ప్రధానమంత్రి పోషక్‌ (మధ్యాహ్న భోజనం) పథకానికి రాష్ట్రవాటాను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. 
• కళాశాల విద్యలో భవన నిర్మాణాల నిర్వహణకు గతేడాది రూ.62.27 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.42.34 కోట్లకు
తగ్గించారు. 
• ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల ముద్రణకు గతంలో మాదిరిగానే రూ. 1.59 కోట్లే కేటాయించారు. అదనపు నిధుల ప్రతిపాదనకు మోక్షం దక్కలేదు. 
• ఇంటర్‌విద్య కేటాయింపులు గతేడాదితో పోలిస్తే రూ.34.60 నుంచి 13.13 కోట్లకు తగ్గాయి.  

కళాశాల విద్యార్థులపై కరుణ
కళాశాల విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కరుణ చూపింది. గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల డైట్‌ చార్జీలకూ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో 2023–24 బడ్జెట్లో కేటాయింపులను భారీగా పెంచేసింది. ఏకంగా రూ.5,609 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.4,690 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా రూ.919 కోట్లు పెంచింది. ఈ పెరుగుదలతో ఇప్పటివరకు వివిధ సంక్షేమ శాఖల్లో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలకు మోక్షం కలగనున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరోవైపు బీసీ, మైనార్టీ గురుకులాల సంఖ్య పెరగడంతో ఆయా విద్యాలయాల్లో విద్యా ర్థులకు డైట్‌ పథకాల అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు తాజా బడ్జెట్లో రూ.2877 కోట్లు కేటాయించింది. 

గత, ప్రస్తుత కేటాయింపులు(రూ.కోట్లలో)          

కేటగిరీ  

2022–23 

2023–24

ఫీజు  రీయింబర్స్మెంట్

2,422

2,877

డైట్

1,764

2,036

 స్టైపెండ్

169

316

ఓవర్సీస్

170        

209

ఉపకారవేతనాలు 

164

172

సొంత పన్నులు పైపైకి..
తెలంగాణ రాష్ట్రం పన్నుల రాబడిలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఏటేటా పెరుగుతున్న సొంత ఆదాయ వనరులే ధీమాగా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే 2022–23 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో రాష్ట్ర పన్నుల కింద రూ.1.10 లక్షల కోట్లకు పైగా సమకూరగా, 2023–24కు ఇవి రూ.1.31 లక్షల కోట్లకు పెరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజి్రస్టేషన్ల పద్దు కిందనే రూ.40వేల కోట్ల వరకు సమకూరనుండగా, ఎక్సైజ్‌ పద్దు కింద రూ.19,884 కోట్లు, స్టాంపులు, రిజి్రస్టేషన్ల ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీనికితోడు రాష్ట్రంలో జరిగే వ్యాపారం, అమ్మకాల ద్వారా రూ.39,500 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ.7,512 కోట్లు సమకూరనున్నాయి. ఇతర ఆదాయాలతో కలిపితే మొత్తం రూ.1.31 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.  
అప్పుల రూపంలో రూ. 46 వేల కోట్లు 
రెవెన్యూ రాబడుల కింద పరిగణించే అప్పుల రూపంలో రూ.46వేల కోట్లకు పైగా ప్రతిపాదించింది. ఇందులో బహిరంగ మార్కెట్‌లో తీసుకునే రుణాలు రూ.40,615 కోట్లు కాగా, కేంద్రం, ఇతర సంస్థల నుంచి మరో రూ.6 వేల కోట్లు తీసుకోనున్నట్టు ప్రతిపాదించింది. కాగా, అంతర్రాష్ట్ర సెటిల్‌మెంట్ల కింద ఈసారి బడ్జెట్‌ రాబడులను రూ. 17,828 కోట్ల కింద చూపెట్టారు. ఈ నిధులు ఏపీ నుంచి రావాల్సి ఉందని, డిస్కంల కింద తమకు ఏపీ చెల్లించాల్సింది ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తే ఏపీ ఇచి్చనప్పుడు తిరిగి చెల్లిస్తామని ఇటీవల కేంద్రానికి రాసిన లేఖ మేరకు నిధులు వస్తాయనే అంచనాతో ఈ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంటున్నాయి. ఇదే పద్దు కింద 2022–23లో నిధులు చూపకపోయినా సవరించిన అంచనాల్లో అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కింద రూ.7,500 కోట్లు సమకూరినట్టు చూపడం గమనార్హం.

మూడేళ్ల క్రితం లక్ష కోట్లు 
సంవత్సరాలవారీగా లెక్కిస్తే రెవెన్యూ రాబడుల్లో గణనీయ వృద్ధి కనిపిస్తోందని బడ్జెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం అంటే 2020–21లో అన్ని రకాల పన్నులు, ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడుల కింద ఖజానాకు రూ.లక్ష కోట్లు సమకూరితే 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు చేరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రూ.1.27 లక్షల కోట్లు రాగా, 2022–23 సవరించిన అంచనాల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు రానుండటం గమనార్హం. 

గత నాలుగేళ్లలో పన్ను ఆదాయం ఇలా..

సంవత్సరం

రాష్ట్ర పన్నుల ఆదాయం (రూ.కోట్లలో)

202021                 

66,650.37

202122 

91,271.42

202223

1,10,592.28

202324

1,31,028.65

 

ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్‌ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది.. కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది. వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ.62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్‌లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు. అయితే, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద గత ఏడాది (2021–22) వచి్చంది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్‌ నాటికి వచి్చంది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్‌’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్‌ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు. 

పన్నుల్లో వాటా.. పరవాలేదా?
ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, తాజా బడ్జెట్‌లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్‌లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు.  

డబుల్‌ రోడ్లకు రూ.2,007 కోట్లు
రాష్ట్రంలో పూర్తిగా మందగించిన డబుల్‌ రోడ్ల నిర్మాణాన్ని మళ్లీ పట్టా లెక్కించేందుకు ప్రభుత్వం రూ.2,007 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.7 కోట్లు తక్కువ. గత బడ్జెట్‌ కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవటంతో పనులు బాగా మందగించాయి. ఈసారి ప్రతిపాదించిన నిధులు ఎంతమేర విడుదలవుతాయో వేచిచూడాలి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి డబుల్‌ రోడ్లను గతంలోనే ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదిలో చాలావేగంగా పనులు జరిగినప్పటికీ, రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో అందక పడకేశాయి. గత రెండేళ్లుగా భారీ వర్షాలతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కానీ, వరద ప్రభావిత రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు లేక పనులు జరగలేదు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. ఇటీవలే సీఎం ఆ పనులపై సమీక్షించి రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. వరదతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న రోడ్ల రెన్యూవల్‌ పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు బడ్జెట్‌లో నాన్‌ప్లాన్‌ కింద ఆ పనులకు రూ.2,434 కోట్లు, భవనాల కోసం రూ.1,515 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త సచివాలయ భవనం పూర్తికి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. రీజినల్‌ రింగురోడ్డు భూసేకరణకు సంబంధించి ఉత్తర భాగంలో రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. దానికిగాను రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1,600 కోట్లు కేటాయించారు.  

Grants

దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్‌డీఎఫ్‌ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్‌డీఎఫ్‌ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్‌డీఎఫ్‌ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. 

dalit bandhu


దళితబంధుకు 17,700 కోట్లు..
తాజా బడ్జెట్‌లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్‌ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు తర్వాత బడ్జెట్లో కేటాయింపులు ఇలా.. (రూ. కోట్లలో)

కేటగిరీ

2021–22

2022–23

2023–24

ఎస్సీ ఎస్డీఎఫ్

21,306.84

33,937.75

36,750.48

ఎస్టీ ఎస్డీఎఫ్

12,304.22

13,412.62

15,232.61

 

మూలధన వ్యయం రూ.37 వేల కోట్లు
రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద రూ. 37,524.70 కోట్లు వెచ్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్‌ పరిమాణంలో ఇది దాదాపు 13 శాతం. 2022–23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 29,728.44 కోట్ల మూలధన వ్యయ కేటాయింపులతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ. 8 వేల కోట్లు అధికం. అదే సవరించిన బడ్జెట్‌ 2022–23 అంచనాల (రూ. 26,934.02 కోట్లు) ప్రకారం అయితే సుమారు రూ. 11 వేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మూలధన వ్యయ కేటాయింపులు భారీగా పెంచడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన వడ్డీలేని రుణాలని పేర్కొంటున్నారు. రాష్ట్రాలకు రూ. 5 లక్షల కోట్ల వరకు వడ్డీలేని రుణాలిస్తామని, కానీ వాటిని మూలధన వ్యయం కిందనే వెచ్చించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయ కేటాయింపులను పెంచిందని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణం ఈసారి దాదాపు రూ. 34 వేల కోట్లు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు మూలధన వ్యయాన్ని ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు. 

పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాలకు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్‌ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. 

నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు
నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్‌ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్‌ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి.

ఐటీ రంగానికి రూ.366 కోట్లు
ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్‌ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్‌సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది.

కాళేశ్వరం పర్యాటక ప్రాజెక్టుకు రూ.750 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకోసం ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌కు ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. కాళేశ్వ­రం ప్రధాన బ్యారేజీతోపాటు దాని పరి­ధిలోని పంప్‌హౌస్‌లున్న ప్రాంతాలు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ­సాగర్‌ లాం­టి జలాశయాల వద్ద తగిన వసతులు కల్పించనున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యా­టకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేసేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. ఈ పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. గత బడ్జెట్‌లో కూడా ఇంతే మొత్తాన్ని కేటాయించినప్పటికీ, నిధులు విడుదల కాలేదు. దీంతో వాటిని ఈ బడ్జెట్‌లో మళ్లీ చూపించారు. 

వ్య‌వ‌సాయ రంగానికి.. 

Farmar


రాష్ట్రంలో రైతు రుణమాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023–24 బడ్జెట్లో రూ. 6,380 కోట్లే కేటాయించింది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుతో ఎంతమంది రైతులు లబ్ధిపొందుతారన్నది స్పష్టం కావాల్సి ఉంది.
పంటనష్ట పరిహారానికి ఈ‘సారీ’.. 
రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినా ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాస్తవంగా నెల కిందట దీనికి సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కొత్తగా బెంగాల్‌ తరహా పంటల బీమా పథకాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. కానీ చివరకు బడ్జెట్లో రైతులకు నిరాశ కలిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది.
మూడు పథకాలకే సింహభాగం కేటాయింపులు..
2022–23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ. 26,831 కోట్లు కేటాయించింది. అంటే గత బడ్జెట్‌కన్నా సుమారు రూ. 2,500 కోట్ల మేర కేటాయింపులు పెంచింది. అయితే ఈసారి మొత్తం కేటాయింపుల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకే సింహభాగం కేటాయించింది. రైతుబంధుకు 2022–23లో రూ. 14,800 కోట్లు కేటాయిస్తే 2023–24 బడ్జెట్లో రూ. 15,075 కోట్లు కేటాయించింది. రైతు బీమాకు 2022–23లో రూ. 1,466 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి బడ్జెట్లో రూ. 1,589 కోట్ల మేర కేటాయింపులు చేసింది. రైతు రుణమాఫీకి 2022–23 బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించి విడుదల చేయని ప్రభుత్వం ఈసారి రూ. 6,380 కోట్లు కేటాయించింది. ఈసారి మొత్తం వ్యవసాయ బడ్జెట్‌లో ఈ మూడు పథకాలకే రూ. 23,049 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధికి కేటాయించింది తక్కువేనన్న విమర్శలున్నాయి.
ప్రగతి పద్దులో వ్యవసాయ కేటాయింపులు
• వ్యవసాయ యాంత్రీకరణకు ప్రగతి పద్దులో రూ. 377.35 కోట్లు కేటాయించారు. 
• రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 39.25 కోట్లు
• ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 75 కోట్లు
• కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 17.50 కోట్లు
• రైతుబంధు సమితికి రూ. 3 కోట్లు
• రైతువేదికలకు రూ. 12 కోట్లు
• మార్కెట్‌ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 75.47 కోట్లు
• వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు రూ. 1.99 కోట్లు
• విత్తనాభివృద్ధి సంస్థకు సాయం రూ. 25 కోట్లు
• మైక్రో ఇరిగేషన్‌కు కేవలం రూ. 1.25 కోట్లు
• ఉద్యాన కార్యకలాపాలకు ప్రోత్సాహం రూ.7.50 కోట్లు 
• ప్రభుత్వ ఉద్యానవనాల అభివృద్ధికి రూ.3.50 కోట్లు

ఆయిల్‌పామ్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు.. 
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

పౌరసరఫరాల శాఖ బడ్జెట్‌ రూ.3,117 కోట్లు
పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ. 3,117 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే ఈసారి పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల ఫోరాలకు కలిపి రూ. 1,259 కోట్లు అధికంగా కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో రూ. 1,879 కోట్లు పేదలకు, విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బియ్యంకు ఇచ్చే రాయితీలకే వెచ్చించనున్నారు. గతంలో రేషన్‌కార్డుదారులకు రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం 2020–21లో కరోనా నేపథ్యంలో ఉచితంగానే బియ్యం సరఫరా చేస్తోంది. కాగా ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఉచితంగానే బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత సరఫరాకే మొగ్గు చూపిస్తోంది. 
 
మత్స్యశాఖకు రూ.530 కోట్లు
వార్షిక బడ్జెట్‌లో మత్స్యశాఖకు ప్రభుత్వం రూ.530 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌ కేటా­యింపులతో పోలిస్తే ఈసారి రూ.65 కోట్లు అధికంగా కేటాయించారు. ఈ నిధులను ఉచిత చేపపిల్లలు, రొయ్యలు, మత్స్య, పారి­శ్రామిక అభ్యున్నతికి, మత్స్యకారులకు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఖర్చు చేయనున్నారు.
   
ఇంధన శాఖకు  రూ.9,486 కోట్లు 
ఇంధన శాఖకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9,486.92 కోట్లను కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 624.17 కోట్లు, ప్రగతి పద్దు కింద 8862.75 కోట్ల నిధులను ప్రతిపాదించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, గృహాలకు రాయితీపై విద్యుత్‌ సరఫరాకు గత బడ్జెట్‌లో రూ.7,665 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలను కేటాయించగా, ఈసారి రూ. 8,260 కోట్లకు పెంచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.10,535 కోట్ల ఆదాయ లోటు ఉండనుందని, ఈమేరకు విద్యుత్‌ సబ్సి డీలను ప్రభుత్వం అందిస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని రెండు నెలల కిందట రాష్ట్ర వి ద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు నివేదించా యి. ప్రభుత్వం రూ.8,260 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలను మాత్రమే కేటాయించడంతో రూ. 2,275 కోట్ల ఆదాయ లోటు ఉండనుంది. ఈ మేరకు లోటు భర్తీకి ఈఆర్సీ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. 

అటవీ శాఖకు రూ.1,471 కోట్లు 
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ శాఖ, హరితహారం కార్యక్రమానికి కలిపి రూ.1,471 కోట్లు ప్రతిపాదించారు. ఇందులోనే అటవీ శాఖ సిబ్బంది వేతనాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రాజెక్ట్‌ టైగర్, నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ నిర్వహణ, కంపా నిధుల్లో రాష్ట్ర వాటా, తదితరాలకు చేసిన కేటాయింపులున్నాయి. గతేడాది బడ్జెట్‌లో హరితహారానికి రూ.932 కోట్లు, ఇతర అవసరాలకు కలిపి రూ.1,410 కోట్ల కేటాయింపులు చేశారు. 2022–23 బడ్జెట్‌ మేజర్‌ స్కీమ్స్‌లో భాగంగా ఫారెస్ట్‌ కాలేజీ ఏర్పాటు కోసం రూ.వంద కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల వ్యయంతో 13 లక్షల ఎకరాల అటవీ పునరుజ్జీవన కల్పన, 11 వేల కి.మీ పరిధిలో అడవుల రక్షణకు సరిహద్దు కంచెలను ఏర్పాటు చేసింది. నీతిఆయోగ్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో దేశంలోనే పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు. దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హారి్టకల్చర్‌ ప్రొడ్యూసర్స్‌.. హైదరాబాద్‌ మహానగరానికి ‘వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు–2022’ను ప్రకటించింది. 

పల్లెకు పట్టాభిషేకం
బడ్జెట్‌లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌లో పీఆర్‌శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.29.586 కోట్ల కేటా యింపుల కంటే రూ.1,840 కోట్లు అధికం. ఐతే పీఆర్‌ శాఖతోపాటు మిషన్‌ భగీరథకు ఇచ్చిన రూ. 600 కోట్లు కూడా కలిపితే ఉమ్మడిగా (పీఆర్, ఆర్‌డీ, మిషన్‌భగీరథ శాఖకు కలిపి) రూ.32,026 కోట్లు కేటాయించినట్టు అవుతుంది. వివిధ పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులు కోరుతూ ఈ శాఖ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ చాలామటుకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. కొత్తగా వేసే గ్రామీణ రోడ్లతోపాటు గతంలో వేసిన రోడ్ల నిర్వహణకు కలిపి రూ.2,587 కోట్లు, మిషన్‌ భగీరథ మెయింటెనెన్స్, మిషన్‌భగీ రథ ఇతర ఖర్చుల కోసం రూ.1,600 కోట్లు, జూని యర్‌ పంచాయతీ సెక్రెటరీల సర్వీసుల క్రమబద్ధీక రణ, దానికి తగ్గట్టుగా వేతనాల పెంపు నిమిత్తం రూ.315 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.849 కోట్లు, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగుల పేస్కేళ్ల సవరణ నిమిత్తం కేటాయింపులు చేశారు. కాగా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు పైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు ఫైనాన్స్‌ ట్రెజరీల ఆమోదం కోసం వేచిచూడ కుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖలో విభాగాల వారీగా బడ్జెట్‌ ఇలా(రూ. కోట్లలో)
 

 

2022–23

2023–24

ఆసరా పింఛన్లు

11,728

12,000

జీతాలు, మెయింటెనెన్స్

7,000

9,072

పల్లెప్రగతి

3,330

3,360

గ్రామీణ రోడ్ల నిర్వహణ(ఎఫ్డీఆర్కలిపి)

1,000

2,000

గ్రామీణరోడ్ల నిర్మాణం

585

587

జాతీయ ఉపాధి హామీ మ్యాచింగ్గ్రాంట్

1,710

1.635

మిషన్భగీరథ(మెయింటెనెన్స్‌)

480

1,000

వడ్డీలేని రుణాలు(గ్రామీణ)

–––

849

మిషన్భగీరథ

520

600

ఎస్టీ పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణం

300

300

 

‘సంక్షేమం’ కాస్త మెరుగు !
సంక్షేమ శాఖలకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు మెరుగుపడ్డాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు కాస్త పెరిగాయి. నూతన నియామకాలు, ఇతరత్రా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. అయితే పెరిగిన కేటాయింపులతో మాత్రం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలకు పెద్దగా ప్రయోజనం లేదు. గత బడ్జెట్‌లో సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు జరిగినట్లుగానే ఈదఫా అటుఇటుగా కేటాయింపులు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)కు గత బడ్జెట్‌ కంటే దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈసారి కూడా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం కింద 2022–23లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఆ నిధులనే ఈసారి క్యారీఫార్వర్డ్‌ చేశారు.

sanskshemam


బీసీలకు అంతంతే...!
బడ్జెట్‌ వెనుకబడిన తరగతుల్లో పెద్దగా ఉత్సాహం నింపలేదు. ఈసారి బీసీ సంక్షేమ శాఖకు రూ.6,229 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.531 కోట్లు పెరిగాయి. తాజాగా బీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. గత బడ్జెట్‌లో ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.100 కోట్లు తగ్గింది. 2022–23లో ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలేవీ అమలు కాలేదు. దీంతో గత కేటాయింపులే ఈసారీ జరిపినట్లు చెప్పొచ్చు. ఇక రజక, నాయూ బ్రాహ్మణ ఫెడరేషన్లకు గత బడ్జెట్‌ మాదిరిగానే ఈసారీ రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల ఫెడరేషన్‌కు కూడా గతంలో మాదిరిగానే రూ.30 కోట్లు కేటాయించగా... మిగతా ఫెడరేషన్లకు నామమాత్రపు నిధులే కేటాయించడంతో ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లైంది. బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో 2023–24 సంవత్సరంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుత సంస్థల అప్‌గ్రెడేషన్, తరగతుల పెరుగుదల, కొత్తగా ఉద్యోగుల నియామకాలు తదితరాలకు నిధుల ఆవశ్యకత పెరగడంతో కేటాయింపుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా క్రిస్టియన్‌ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్‌లకు ఆర్థిక చేకూర్పు పథకాల కింద 270 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమ శాఖకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలకు కూడా కేటాయింపులు కాస్త మెరుగుపడ్డట్లు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ శాఖల పరిధిలో కొత్త పథకాల ఊసులేదు.

రాష్ట్ర సామాజిక–ఆర్థిక సర్వే నివేదిక
తలసరి ఆదాయంలో రాష్ట్రం దూకుడు
తెలంగాణ ప్రజల తలసరి ఆదాయంలో దూసుకుపోతోందని ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొంది. 2021–22లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,75,443 కాగా.. 2022–23లో 15.1శాతం వృద్ధితో రూ.3,17,115కు పెరుగుతుందని అంచనా వేసింది. మరోవైపు దేశంలో ప్రజల తలసరి ఆదాయం 2021–22లో రూ.1,50,007 కాగా.. 2022–23లో 1,70,620కు పెరుగుతుందని పేర్కొంది. 2020–21లో రాష్ట్రంలో చూస్తే.. రంగారెడ్డి జిల్లా రూ.6,69,102 తలసరి ఆదాయంతో టాప్‌లో ఉందని.. హైదరాబాద్‌ (రూ.3,49,061), సంగారెడ్డి (రూ.2,49,091) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది.

ఆ రంగాల్లోనే ఉపాధి
రాష్ట్ర జీఎస్డీపీని వ్యవసాయం/అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవలు అనే మూడు రంగాల ఆర్థిక సహకారం ఆధారంగా లెక్కిస్తారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్ర స్థూల విలువ జోడింపుకు సేవల రంగం అధిక సహకారం అందిస్తుండగా.. పరిశ్రమలు, వ్యవసాయం/అనుబంధ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉంటున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. 2022–23లో తెలంగాణ జీఎస్‌వీఏకు సేవల రంగం 62.8శాతం, పరిశ్రమల రంగం 19శాతం, వ్యవసాయం/అనుబంధ రంగాలు 18.2శాతం తోడ్పాటు అందించాయి.
• 2022–23 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం 17.5శాతం, వ్యవసాయ రంగం 11.9 శాతం, పరిశ్రమల రంగం 10.5శాతం వృద్ధి నమోదు చేస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
• సామాజిక–ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు వ్యవసాయ రంగమే అండగా నిలుస్తోంది. 2020–21 నాటికి రాష్ట్రంలో 45.8శాతం మందికి వ్యవసాయం, 21శాతం మందికి పరిశ్రమలు, 33.2 శాతం మందికి సేవల రంగం ఉపాధి కల్పిస్తోంది.
‘ఊరి’కి కొత్త రూపం
రాష్ట్రంలోని గ్రామాల్లో మెరుగైన పాలన, అభివృద్ధి కోసం.. గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్య సాధన దిశగా భారీగా సంస్కరణలు అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం సామాజిక–ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది. రాష్ట్ర జనాభాలో 61.12 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపింది. కొత్త పంచాయతీరాజ్‌చట్టం ద్వారా పల్లె ప్రగతి, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించింది. 2019 సెప్టెంబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ దాకా పంచాయతీరాజ్‌ సంస్థలకు రూ.11,088.80 కోట్లు (కేంద్రం, రాష్ట్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ల కింద) విడుదల చేశామని వివరించింది. 2022–23లో పంచాయతీరాజ్‌ సంస్థలకు నెలకు రూ.256.66 కోట్ల చొప్పున మొత్తం రూ.1,684.47 కోట్లు విడుదల చేశామని.. ఐదు విడతల పల్లె ప్రగతిలో భాగంగా (2022 జూన్‌ దాకా) రూ.14,235.50 కోట్లు వ్యయం చేశామని వివరించింది. స్వయం సహాయక సంఘాలకు 2022–23 జనవరి 18 నాటికి రూ.12,684.59 కోట్లు ఆర్థిక సాయం అందజేసినట్టు తెలిపింది.
పుంజుకున్న పర్యాటకం
రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు ఎన్నో ఉన్నా.. వాటిపై ప్రచారం లేక పర్యాటకుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. అయితే కోవిడ్‌ ఆంక్షల సడలింపు తర్వాత పర్యాటక రంగం పుంజుకుంది. రాష్ట్రంలో 2021–22లో 3,20,00,620 మంది దేశీయ టూరిస్టులు పర్యటించగా.. ఈ సంఖ్య 2022–23లో 6,07,48,425కు పెరిగింది. విదేశీయుల సంఖ్య కూడా 5,917 మంది నుంచి 68,401కి పెరిగింది.
రాష్ట్రానికి ‘హరిత’ హారం!
రాష్ట్రంలో 26,969.61 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉందని.. మొత్తం తెలంగాణ భౌగోళిక ప్రదేశంలో ఇది 24.06 శాతం అని సామాజిక–ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొంది. ఇండియన్‌ స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్స్‌ ప్రకారం.. తెలంగాణలో అడవుల శాతం 2015లో 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2021 నాటికి 21,214 చ.కిలకు పెరిగినట్టు తెలిపింది.  హరితహారంతోపాటు ఇతర కార్యక్రమాలతోపాటు అడవుల పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొంది. 
• 2011–21 మధ్య అతి తక్కువగా అడవులు, పచ్చదనం క్షీణత నమోదైన ఏడు నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచిందని ప్రభుత్వం తెలిపింది.
• పట్టణప్రాంతాల్లో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి చేపట్టగా.. ఇ ప్పటికే 77 పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వివరించింది.
• 2020, 2021 సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌ ఎఫ్‌ఏఓ) ద్వారా ‘ట్రీ సిటీ ఆఫ్‌ వరల్డ్‌’గా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని గుర్తు చేసింది. 

సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.10,384 కోట్లు 
ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో అభివృద్ధి పనుల కోసం కేటాయించే ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌)కి తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలో అక్కడి ప్రజాప్రతినిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోరితే అక్కడికక్కడే ప్రకటించేందుకు ఎస్‌డీఎఫ్‌ కింద రూ.10,384 కోట్ల మేర కేటాయింపులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు కేవలం రూ.2 వేల కోట్లుగానే ఉండటం గమనార్హం. మరోవైపు అసెంబ్లీ అభివృద్ధి పథకం కింద ప్రతి శాసనసభ్యుడు లేదా శాసనమండలి సభ్యులకు రూ. 5 కోట్ల నిధిని కొనసాగించాలని బడ్జెట్లో నిర్ణయించారు. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  

ఈహెచ్‌ఎస్‌కు రూ.362 కోట్లు కేటాయింపు..

Health


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్నట్టుగా ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)’ను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల భాగస్వామ్యంతో విధానంలో ఆరోగ్య పథకాన్ని రూపొందించనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొంది. ఈ పథకం కోసం రూ.362 కోట్లు కేటాయించడంతోపాటు.. ఉద్యోగుల వాటాగా వారి జీతాల నుంచి ఒక శాతం చొప్పున దాదాపు రూ.350 కోట్లు సేకరించనుంది. మొత్తంగా ఈ పథకం కోసం రూ.700 కోట్లతో కార్ఫస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కార్ఫస్‌ ఫండ్‌ను ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి, ఉద్యోగులు చికిత్స చేయించుకున్న తర్వాత సదరు ఖర్చు సొమ్మును ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు బదిలీ చేయనున్నట్టు వివరించింది. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా ఈహెచ్‌ఎస్‌ ట్రస్టుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

 ఆరోగ్యం అంకెలు రూ.కోట్ల‌లో..

Health Graph

‘హెల్త్‌’కు కేటాయింపులివీ..
• మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణానికి రూ.1,033 కోట్లు
• మెడికల్‌ కాలేజీలకు రూ.225.90 కోట్లు.. నర్సింగ్‌ కాలేజీలకు రూ. 26.26 కోట్లు
• సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రూ.500 కోట్లు
• వైద్య విధాన పరిషత్‌కు రూ.82.85 కోట్లు
• ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి రూ.37.76 కోట్లు..
• నిమ్స్‌కు రూ.15.67 కోట్లు
• వైద్య విధాన పరిషత్‌లోని ఆస్పత్రుల ఆధునికీరణకు రూ.200 కోట్లు
• వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో సర్జికల్‌ కన్జూమబుల్స్‌ కోసం రూ.75 కోట్లు
• ఆరోగ్యశ్రీ కింద కవర్‌కాని బీపీఎల్‌ కుటుంబాలకు నిమ్స్‌లో చికిత్సకు రూ.2 కోట్లు
• వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఇంట్రిగ్రేటెడ్‌ హాస్పిటల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు రూ.108 కోట్లు, డయాగ్నస్టిక్‌ పరికరాల కోసం రూ. 100 కోట్లు
• కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 1.60 కోట్లు
• ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రూ.2.71 కోట్లు, టిమ్స్‌కు రూ. 5 కోట్లు
• జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు సబ్సిడీపై 
ఆహారానికి రూ.70 కోట్లు
• ఇతర ఆస్పత్రుల్లో ఇంటిగ్రేటెడ్‌ హాస్పిటల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు రూ. 267 కోట్లు
• ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.115 కోట్లు
• ఔషధాల కేంద్రీకృత కొనుగోలుకు రూ.377.43 కోట్లు
• ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీరణకు రూ.50 కోట్లు
• 108 సేవలకు రూ.29.82 కోట్లు, 104 సేవలకు రూ. 15 కోట్లు
• కేసీఆర్‌ అమ్మ ఒడికి రూ.325 కోట్లు
• 102 సేవలు (అమ్మ ఒడి) రూ.5 కోట్లు 

మార్గదర్శకాలపై కసరత్తు షురూ..
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈహెచ్‌ఎస్‌ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్యారోగ్యశాఖ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ పథకం కింద పాత కార్డుల స్థానంలో కొత్త వాటిని ఇవ్వనున్నారు. ఇప్పటివరకు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఎవరో ఒకరికే ఆరోగ్య కార్డు ఇచ్చేవారు. కొత్త పథకంలో ఇద్దరికీ ఇస్తారు. తద్వారా భార్య తరఫున వారి తల్లిదండ్రులకు, భర్త తరఫున వారి తల్లిదండ్రులకు వైద్య వసతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక జర్నలిస్టులకు కూడా ఇదే కొత్త పథకంలో చోటు కల్పిస్తారు. అయితే ఉద్యోగుల తరహాలో జర్నలిస్టుల నుంచి వాటాను వసూలు చేయకుండా.. ప్రభుత్వమే సొమ్మును కార్ఫస్‌ ఫండ్‌లో జమచేస్తుందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి, జర్నలిస్టులకు, ఉద్యోగులకు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్తున్నాయి. 

గుర్తింపు ఉన్న ఆస్పత్రుల్లోనే..
ఉద్యోగుల కొత్త పథకాన్ని కేవలం ‘నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌)’లోనే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. అంటే కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనే వైద్యసేవలు అందుతాయి. ఈ గుర్తింపు పొందిన ఆస్పత్రులు రాష్ట్రంలో 120 ఉన్నాయి. కొత్త ఆరోగ్య కార్డు పొందిన ఉద్యోగులు, జర్నలిస్టుల్లో ఎవరికైనా జబ్బు చేస్తే.. నేరుగా కార్డు తీసుకొని ఈ ఆస్పత్రులకు వెళ్లవచ్చు.  

వైద్యారోగ్యశాఖకు రూ.12,161 కోట్లు
మొత్తంగా వైద్యారోగ్యశాఖ బడ్జెట్‌ ఏటా పెరుగుతూ వస్తోంది. 2022–23లో రూ.11,440 కోట్లు కేటాయించగా.. తాజాగా బడ్జెట్లో రూ.12,161 కోట్లు ఇచ్చారు. గత బడ్జెట్లో కేసీఆర్‌ కిట్‌కు రూ.443 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అంతేమొత్తం చూపారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులను రూ.981 కోట్ల నుంచి రూ. 1,101 కోట్లకు పెంచారు. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం కోసం రూ.200 కోట్లు కేటాయించారు. అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని, 4 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రతి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తారు. మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటవుతాయి.  

పేదల ఇళ్లకు రూ.12,000 కోట్లు 

House


పేదల గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకంలో తీవ్ర చికాకులు వచ్చిన నేపథ్యంలో, దాని స్థానంలో.. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి, వారే ఇళ్లను నిర్మించుకునేలా కొత్త పథకానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో ఇలాంటి 4 లక్షల ఇళ్లకు సంబంధించి రూ.12 వేల కోట్లను ప్రతిపాదించినా.. నయా పైసా విడుదల కాలేదు. ఈ కొత్త పథకం విధివిధానాలు రూపొందించకపోవటంతో నిధులు బడ్జెట్‌ అంకెలకే పరిమితమయ్యాయి. దీంతో ఆ పథకాన్ని ప్రకటించిన తొలి ఏడాది వృథాగా గడిచిపోయింది. ఇప్పుడు మళ్లీ 4 లక్షల ఇళ్లకు ప్రభుత్వం నిధులు ప్రతిపాదించింది. అయితే, ఈ సారి కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయాన్ని కలుపుకొని, మిగతా మొత్తాన్ని తన వాటాగా ప్రతిపాదించటం విశేషం. నాలుగు లక్షల ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు వస్తాయని రాష్ట్ర సర్కార్‌ ఆశిస్తోంది. ఇందులో 60% గ్రామీణ ప్రాంతాలు, 40% పట్టణ ప్రాంతాలకు సంబం«ధించి యూనిట్లు మంజూరు అవుతాయని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు యూనిట్‌ కాస్ట్‌గా ఒక్కో ఇంటికి రూ.72 వేలు, పట్టణ ప్రాంతాలకు ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర అందాల్సి ఉంటుంది. ఇవి పోను మిగతా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్ర భుత్వం తాజా బడ్జెట్‌లో 7,350 కోట్లను ప్రతిపాదించింది. సొంత జాగా ఉన్నవారికి ఇళ్లను నిర్మించుకునేందుకు నిధులు కేటాయించాలంటే, తొలుత ఆ పథకానికి విధివిధానాలు రూపొందించాలి.  
డబుల్‌ బెడ్రూం ఇళ్లకు రూ. 4,650 కోట్లు.. 
ఇక డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.4,650 కోట్లను ప్రతిపాదించింది. ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న ఇళ్లు, పరిపాలన అనుమతులు వచ్చి ఇంకా ప్రారంభంకాని ఇళ్లను ఈ నిధులతో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇలా దాదాపు 2.70 లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది.    
అంతా గందరగోళం.. 
పేదల ఇళ్ల నిధులకు సంబంధించి గందరగోళం నెలకొంది. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.12 వేల కోట్లు పూర్తిగా సొంత జాగాలో ఇళ్లు నిర్మించే పథకానికే చెందుతాయని, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు బడ్జెటేతర నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. అంటే.. సొంత జాగా పథకంలో యూనిట్‌ కాస్ట్‌ రూ.3 లక్షలు అయినందున, రూ.12 వేల కోట్ల నిధులు కేటాయిస్తే మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి వీలుకల్పిస్తున్నట్లవుతుంది. కానీ, ఆర్థిక శాఖ విడుదల చేసిన బడ్జెట్‌ స్వరూపం నోట్‌లో అంకెలు మరోలా ఉన్నాయి. సొంత జాగాలో ఇళ్ల పథకం కింద 2,63,000 ఇళ్లకు, రూ.7,890 కోట్ల నిధులు ప్రతిపాదించినట్టు ఉంది. దీంతో ఆ విభాగం అధికారులు కూడా గందరగోళంలో పడ్డారు. మంగళవారం సంబంధిత మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసి ఏ లెక్కలు సరైనవో తెలుసుకున్నాక గాని దీనిపై స్పష్టత రాదని ఒక నిర్ణయానికి రావడం గమనార్హం.  

పట్టణాలకు రూ. 11,372 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 వార్షిక బడ్జెట్‌ లో పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖకు రూ.11,372 కోట్లు కేటాయించారు. ఇందులో జీతభత్యాలు, నిర్వహణ వ్యయం కింద రూ. 3,906 కోట్లు కేటాయించగా, ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.7,176 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ శాఖకు బడ్జెట్‌లో అదనంగా కేటాయించింది రూ.469 కోట్లు. ప్రస్తుతం కేటాయింపుల్లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.221.18 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.149.97 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా పురపాలక సంఘాలకు గ్రాంటుగా రూ.733 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. వడ్డీ లేని రుణాల కోసం రాష్ట్రంలోని కార్పొరేషన్లకు రూ.283 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి పనుల కోసం పురపాలక సంఘాలకు సహాయ గ్రాంటుగా రూ. 300 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రాయో జిత పథకాలకు రాష్ట్ర వాటా కింద కరీంనగర్, వరంగల్‌ స్మార్ట్‌సిటీల అభివృద్ధి పనుల కోసం ఒక్కో కార్పొరేషన్‌కు రూ.175.68 కోట్ల చొప్పున కేటాయించారు. అమృత్‌ 2.0 కింద రూ.133.54 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 

వైకుంఠధామాలకు రూ.100 కోట్లు
రాష్ట్రంలో అభివృద్ధి చేయతలబెట్టిన వెజ్‌–నాన్‌వెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల కోసం గత బడ్జెట్‌ తరహాలోనే రూ.400 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో వైకుంఠధామాలకు రూ.100 కోట్లను ఈసారి ప్రతిపాదించారు. హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం గత సంవత్సరం కేటాయించిన నిధులేవీ ఖర్చు కాకపోగా, ఈసారి తిరిగి అంతే మొత్తంలో కేటాయించడం గమనార్హం. హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీకి రూ.500 కోట్లు కేటాయించారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన పాతబస్తీ మెట్రో కనెక్టివిటీ కోసం ఈసారి కూడా రూ.500 కోట్లు ప్రతిపాదించారు. గత సంవత్సరం కేటాయించినప్పటికీ మంజూరు చేయకపోవడంతో పాతబస్తీ మెట్రో పనులేవీ ముందుకు సాగలేదు. హైదరాబాద్‌ వాటర్‌బోర్డు పేదలకు అందిస్తున్న 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాకు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 300 కోట్లు, వాటర్‌బోర్డు పనుల కోసం మరో రూ.300 కోట్లు, మూసీ పరీవాహక అభివృద్ధి పనుల కోసం రూ. 200 కోట్లు కేటాయించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రతిపాదించారు. 

హోంశాఖకు రూ.9,599 కోట్లు
బడ్జెట్‌ కేటాయింపులలో హోంశాఖకు గతంలో కంటే నిధులు ఒకింత పెరిగాయి. 2023–24 వార్షిక బడ్జెట్‌లో హోంశాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులకు కలిపి మొత్తం రూ.9599 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌కు భిన్నంగా ఈ సారి హోంశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రగతి పద్దుకు నిధులు తగ్గించి..నిర్వహణ పద్దు కింద ఎక్కువ నిధులు కేటాయించారు. ఈ సారి బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ. 8727.72 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.871.24 కోట్లు ప్రతిపాదించారు. పోలీస్‌ భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తి కావడం, హైదరాబాద్‌ నగరంలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తికావడం తదితర కారణాలతో ప్రగతి పద్దుకు నిధులు తగ్గినట్టు తెలుస్తోంది. అదే సమయంలో భారీ సంఖ్యలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో జీతభత్యాలు ఇతర ఖర్చులు పెరగనున్న నేపథ్యంలో నిర్వహణ పద్దు కింద నిధులు పెంచారు. 

ప్రధాన కేటాయింపులు, తగ్గింపులు ఇలా.. 
• అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపకశాఖను మరింత బలోపేతం చేసేలా బడ్జెట్‌లో నిధులు పెంచారు. గత బడ్జెట్‌లో(2022లో) రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సర్వీస్‌కు రూ.16.12 కోట్లు ఉండగా ఈ సారి బడ్జెట్‌లో 32.14 కోట్లు పెంచారు. 
• డీజీపీ ఖాతా కింద నిర్వహణ పద్దులో నిధులు రూ.4145.35 కోట్ల నుంచి రూ.4789.30 కోట్లకు పెంచారు. అదే విధంగా అగ్నిమాపకశాఖ, ఇత రపోలీస్‌ కమిషనరేట్లు, జైళ్లశాఖలకు సైతం నిర్వహణ బడ్జెట్‌ పెంచారు. 
• డీజీపీ ఖాతా కింద ప్రగతి పద్దు నిధుల్లో కోత విధించారు. గత బడ్జెట్‌లో రూ.1104.85 కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.474.85 కోట్లకు తగ్గించారు. 
• సైబర్‌ సెక్యురిటీకి రూ.35.50 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 
• తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ బ్యూరో/కు రూ 8.50 కోట్లు కేటాయించారు. 
• కొత్త పోలీస్‌ భవనాలు , స్టేషన్ల నిర్మాణానికి రూ.100 కోట్లు, జిల్లా పోలీస్‌ కార్యాలయాల భవన నిర్మాణాలకు రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ భవనానికి రూ.10 కోట్లు కేటాయించారు.
• పోలీస్‌ స్టేషన్లలో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి రూ.3 కోట్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రూ.1 కోటి చొప్పున కేటాయించారు. 

గత మూడేళ్లుగా హోంశాఖ బడ్జెట్‌ కేటాయింపులు (రూ.కోట్లలో).. 

ఆర్థిక సంవత్సరం

ప్రగతిపద్దు

నిర్వహణ పద్దు

2021–22

706.36

7,419.24

2022–23

1,468.54

7,846.99

2023–24

871.24

8,727.72

ఆర్టీసీకి  రూ.1,500 కోట్లు
ఆర్టీసీకి బడ్జెట్‌లో మళ్లీ నిరాశే ఎదురైంది. డొక్కు బస్సులతో కుస్తీ పట్టలేక కొత్త బస్సులు కొనేందుకు వరస ఆర్డర్లు ఇస్తున్న ఆర్టీసీ.. ప్రభుత్వం నుంచి ఈసారి ఎక్కువ నిధులు ఆశించింది. కానీ, ఎప్పటిలాగే రూ.1,500 కోట్లతో ప్రభుత్వం సరిపెట్టింది. గత బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించినా ఇప్పటివరకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అధికారులంటున్నారు. ఆ లెక్కన ఆ బడ్జెట్‌ చివరి దశకు చేరుకున్నా ఇంకా రూ.1,100 కోట్లు బకాయి ఉండటం విశేషం. ఈసారి కనీసం వేయి కోట్లు అదనంగా ఇస్తే కొత్త బస్సుల కొనుగోలుకు ఉపయోగపడతాయని అధికారులు ఆశించారు. ఇందుకు రూ.2,500 కోట్లను ప్రతిపాదించాలని నిర్ణయించారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చ తర్వాత ఎప్పటిలాగానే రూ.1,500 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అంతకంటే ఎక్కువ నిధులు అందవన్న సంకేతాలతోనే ఈ మార్పు జరిగిందని అంటున్నారు. రాయితీ బస్‌పాస్‌ల మూలంగా ఆర్టీసీకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేసే రూ.850 కోట్లు, కొత్త బస్సుల కోసం రుణంగా రూ.650 కోట్లు దక్కాయి. ఎలాంటి గ్రాంట్‌ కేటాయించలేదు. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు 32 లక్షల మంది ప్రయాణికులను చేరవేసే ఆర్టీసీకి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే ఇవ్వటం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్టీసీకి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రూ.6 వేల కోట్లు కేటాయించాలని ఎన్‌ఎంయూ నేతలు కమాల్‌రెడ్డి, నరేందర్‌ పేర్కొన్నారు. సంస్థకోసం మొక్కుబడిగా రూ.1,500 కోట్లు ఇవ్వటమంటే దానిపై సవతితల్లి ప్రేమ చూపటమేనని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు. బడ్జెట్‌లో 2 శాతం నిధులు అడిగినా ఇవ్వకపోవటం దారుణమని ఈయూ నేత రాజిరెడ్డి పేర్కొన్నారు.  

 

Published date : 07 Feb 2023 07:00PM

Photo Stories