Skip to main content

Tata Group: ప్రభుత్వ రంగ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?

Air India

పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియలో, ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్‌ దక్కించుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... ఎయిరిండియాకు సంబంధించి రూ. 15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదును కేంద్రానికి చెల్లించనుంది. ఈ విషయాలను అక్టోబర్‌ 8న కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. 2021 డిసెంబర్‌ నాటికి లావాదేవీ పూర్తి కావచ్చని భావిస్తున్నామన్నారు.

ఏడాది దాకా ఉద్యోగుల కొనసాగింపు...

బిడ్డింగ్‌ నిబంధనల ప్రకారం లావాదేవీ పూర్తయిన నాటి నుంచి ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్‌ కొనసాగించాలని విమానయాన శాఖ కార్య దర్శి రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) అవకాశం ఇవ్వొచ్చు. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు (8,084 మంది పర్మనెంట్, 4,001 మంది కాంట్రాక్ట్‌) ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది సిబ్బంది ఉన్నారు.

 

రెండో పెద్ద ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌...

ఎయిరిండియాను దక్కించుకోవడంతో టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్‌ బ్రాండ్‌ చేరినట్లవుతుంది. టాటా గ్రూప్‌ ఇప్పటికే ఎయిర్‌ఏషియా, విస్తార (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి) విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. ఈ మూడు సంస్థల కన్సాలిడేషన్‌ ప్రక్రియ గానీ పూర్తయితే దేశీయంగా ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా టాటా గ్రూప్‌ ఆవిర్భవించనుంది.

 

1932లో ప్రారంభం...

స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్‌జీ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్‌ ఇండియాగా పేరు మార్చారు. ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచింది. తాజా పరిణామంతో 1953లో జాతీయం చేశాక, దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా సొంత గూటికి చేరినట్లయింది.
 

చ‌ద‌వండి: ఫిచ్‌ అంచనాల ప్రకారం 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రభుత్వ రంగ ఎయిరిండియాను సొంతం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు  : అక్టోబర్‌ 8
ఎవరు    : టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఎందుకు : పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియలో టాటా గ్రూప్‌ విజేతగా నిలిచినందున...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 09 Oct 2021 04:15PM

Photo Stories