BBC Tax Survey: బీబీసీలో ఆర్థిక అవకతవకలు
కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని ఫిబ్రవరి 17న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్‌లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది.
పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది.