CAG Audit Report: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CAG లెక్కలు
తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్‌బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు ఎవరు?
స్థిరంగా పన్ను ఆదాయం..
కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వివరాలు
నెల | పన్నుఆదాయం | పన్నేతర ఆదాయం | గ్రాంట్ ఇన్ ఎయిడ్ |
ఏప్రిల్ | 9,291.97 | 502.17 | 189.66 |
మే | 9,459.42 | 411.44 | 101.54 |
జూన్ | 10,461.02 | 5961.35 | 1,134.51 |
జూలై | 10,029.64 | 557.58 | 563.05 |
ఆగస్టు | 10,463.37 | 407.42 | 2,022.84 |
Also read: S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్‌బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే!
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 30th కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP