Skip to main content

Cryptocurrency: క్రిప్టో కరెన్సీలు పెరిగిపోతే.. ఆర్థిక సంక్షోభమే!

ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలు పెరగడానికి అనుమతించడం తదుపరి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్ డిసెంబ‌ర్ 21న‌ హెచ్చరించారు.

ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం–సెంట్రల్‌ బ్యాంక్‌ మధ్య ‘‘పటిష్ట సమన్వయ విధానం’’ ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ వివరించారు. ఆయా అంశాలపై బిజినెస్‌ స్టాండెర్డ్‌ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్‌ సమ్మిట్‌ 2022లో కార్యక్రమంలో శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ.. బిట్‌కాయిన్‌ వంటి ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధం కోసం ఆర్‌బీఐ చేస్తున్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అటువంటి సాధనాలకు అంతర్లీన విలువ లేదని, అలాగే అవి స్వభావరీత్యా ఊహాజనితమైనవని చెప్పారు.
 

Gold ATM: దేశంలో తొలి గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

‘‘క్రిప్టో కరెన్సీ సాధనలు 100 శాతం ఊహాజనిత కార్యకలాపాలకు సంబంధించినవి. వీటిని నిషేధించాలన్న అభిప్రాయాన్ని నేను ఇప్పటికీ కలిగి ఉన్నాను. మీరు దీన్ని నియంత్రించి (చట్టబద్ధత ద్వారా) దానిని పెంచడానికి అనుమతిస్తే, తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల నుంచి వస్తుంది. దయచేసి నా మాటలను గుర్తించండి’’ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వాలకు తీవ్ర నష్టం ఉంటుందని తాను భావిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల విలువ 190 బిలియన్‌ డాలర్ల నుంచి 140 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయిన విషయాన్ని గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ మార్కెట్‌కు అంతర్లీన విలువ లేదని స్పష్టం చేశారు.  

Weekly Current Affairs (Economy) క్విజ్ (18-24 నవంబర్ 2022)

డిజిటల్‌ మనీపై ఏమన్నారంటే.. 
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై గవర్నర్‌ మాట్లాడుతూ..  డిజిటల్‌ మనీదే భవిష్యత్తు అన్నారు. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ వైపు దృష్టి పెట్టిందన్న విమర్శల్లో అర్థం లేదన్నారు. అలాంటి భయాలు సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు, నిర్ణయాలను ప్రేరేపించబోవని ఉద్ఘాటించారు. సీబీడీసీ, యూపీఐ వాలెట్‌లు వేర్వేరని పేర్కొంటూ, 24 గంటల్లో డబ్బును తిరిగి ఇచ్చే సామర్థ్యం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు  డిజిటల్‌ కరెన్సీ విధానంలో ఉన్నట్లు గవర్నర్‌ తెలిపారు.  
ధరలపై ఇలా..
ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం–సెంట్రల్‌ బ్యాంక్‌ మధ్య ‘‘పటిష్ట సమన్వయ విధానం’’ ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అన్నారు. ధరల స్పీడ్‌ కట్టడిపై ఆర్‌బీఐ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తోందో, కేంద్రం కూడా ఆదే స్థాయిలో ఈ అంశంపై దృష్టి సారించిందని అన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది. అయితే నవంబర్‌కు ముందు గడచిన 9 నెలల కాలంలో ఈ స్థాయిపై రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగింది. దీనికి కారణాల ఏమిటన్న అంశంపై కొద్ది వారాల క్రితమే కేంద్రానికి ఆర్‌బీఐ ఒక నివేదిక సమర్పించింది.

ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రం–ఆర్‌బీఐ సమన్వయ చర్యలను వివరిస్తూ,  ‘‘ఆర్‌బీఐ రేట్ల పెంపు, ద్రవ్య విధానాలు, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విధానాల ద్వారా ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో కేంద్రం పెట్రోల్‌ లేదా డీజిల్‌పై పన్నులను తగ్గిస్తోంది.  దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలపై సుంకాలు తగ్గించడం వంటి పలు సరఫరా వైపు సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన విధాన రూపకల్పనకు ప్రస్తుత ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ (2023–24) దృష్టి పెడుతుంది’’ అని గవర్నర్‌ వివరించారు. అంతర్జాతీయ అంశాలు కొంత అనిశ్చితికి గురిచేస్తున్నా, దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత పటిష్టంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. రుణ వృద్ధి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

GST: రూ.2 కోట్లు దాటితేనే ‘జీఎస్టీ’నేరం

Published date : 22 Dec 2022 04:31PM

Photo Stories