Skip to main content

Gold ATM: దేశంలో తొలి గోల్డ్‌ ఏటీఎం ప్రారంభం

నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్‌ కార్డులతో బంగారం విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది.

గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను డిసెంబ‌ర్ 3వ తేదీ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీ­తా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్‌ ఏటీఎం నిదర్శనమన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్‌ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 
గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్‌ తరుజ్‌ మాట్లాడుతూ.. ఈ గోల్డ్‌ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించవచ్చన్నారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చన్నారు. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్‌ తీసుకోవచ్చని తెలిపారు.  త్వరలోనే ఎయిర్‌పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్‌లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో కూడా గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. 

☛ ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం

Published date : 05 Dec 2022 03:44PM

Photo Stories