Skip to main content

RBI: ఇకపై ‘రూపీ’లోనూ విదేశీ వాణిజ్యం

RBI allows payments for international trade in rupee
RBI allows payments for international trade in rupee

భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా గుర్తించే దిశగా కీలక అడుగు పడింది. వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్‌మెంట్‌ (నిర్వహించేందుకు) చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాజా చర్య భారతదేశం నుండి ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి అలాగే రూపాయిపై గ్లోబల్‌ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో దాదాపు 6 శాతం కరిగిపోయిన రూపాయికి మద్దతును ఇవ్వడానికి ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ దిశలో  తాజాగా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి భారత్‌ రూపాయి పట్ల విశ్వాసం పెరగడానికి కీలకచర్య తీసుకుంది.   

Also read: విదేశీ మారక ద్రవ్య నిల్వలు

లాభం ఏమిటి? 
కొన్ని దేశాలతో వాణిజ్యం కోసం అమెరికా డాలర్‌ వంటి ప్రపంచ కరెన్సీని ఉపయోగించకుండా, ప్రత్యామ్నాయ మార్గాన్ని భారత్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు, ఉక్రెయిన్‌ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాకు డాలర్‌ అందుబాటును అమెరికా తగ్గించింది. ఇది రష్యన్‌ వస్తువుల తక్కువ ధరను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న భారతీయ కంపెనీలను... దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులవైపు చూసేలా చేసింది.

Also read; T Hub 2.0: ‘టీ–హబ్’ అంటే ఏమిటి..? దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?

కొత్త యంత్రాంగం పనితీరు ఇలా... 
కొత్త సెటిల్‌మెంట్‌ యంత్రాంగం ప్రకారం, ఎగుమతులు– దిగుమతులు రెండు వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల మధ్య మార్కెట్‌ నిర్ణయించబడే మారకపు రేటుతో రూపాయిలో డినామినేట్‌ అవుతాయి. ఈ మేరకు  ఇన్‌వాయిస్‌ రూపొందుతుంది. ఈ వాణిజ్య ఒప్పందాల సెటిల్‌మెంట్‌కు అధీకృత భారతీయ బ్యాంకులు భాగస్వామి ట్రేడింగ్‌ దేశంలోని ఆ దేశ అధీకృత  బ్యాంకులో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవాలి. ఈ యంత్రాంగాన్ని ఉపయోగించే భారతీయ దిగుమతిదారులు రూపాయల్లో చెల్లించాలి. ఈ మొత్తాలు వస్తువులు లేదా సేవల సరఫరాలకు సంబంధించి ఇన్‌వాయిస్‌లకుగాను భాగస్వామి దేశం కరస్పాండెంట్‌ బ్యాంక్‌ ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోకి జమ అవుతాయి. మరోవైపు భారతీయ ఎగుమతిదారులు, భాగస్వామి దేశం కరస్పాండెంట్‌ బ్యాంక్‌  ఏర్పాటు చేసిన ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోని బ్యాలెన్స్‌ నుండి రూపాయలలో తమ డబ్బును పొందుతారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులను కూడా రూపాయిల్లో పొందవచ్చు. అయితే, అటువంటి ముందస్తు చెల్లింపు చేయడానికి ముందు, బ్యాంకులు సంబంధిత ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా అమలు చేసిన ఎగుమతి ఆర్డర్‌ల కు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలి. ఆపై నిధులనే పరస్పర అవగాహన మేరకు ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులుగా వినియోగించాలి.

Also read: World Ocean Day 2022

80 దిశగా రూపాయి... 
డాలర్‌ మారకంలో రూపాయి పతన రికార్డు ఆగడం లేదు. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం 19 పైసలు పతనంతో 79.45కు క్షీణించింది. ఒక దశలో 79.50ని కూడా చూసింది. రూపాయికి ఈ రెండు స్థాయిలూ చరిత్రాత్మక కనిష్టాలు. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్, దేశం నుంచి విదేశీ పెట్టుబడుల వరద, క్రూడ్‌ ఆయిల్‌ ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు వంటి పలు అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App
Published date : 12 Jul 2022 05:24PM

Photo Stories