Skip to main content

విదేశీ మారక ద్రవ్య నిల్వలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాల ప్రకారం 2019, ఫిబ్రవరి 1 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 400.24 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ మెరుగుపడటం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వల విలువలో పెరుగుదల నమోదైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలో నాలుగు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి.. 1. విదేశీ కరెన్సీ ఆస్తులు; 2. బంగారం; 3. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్; 4. అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund)లో దేశ రిజర్వ్ స్థితి.

- అమెరికా డాలర్‌తో పాటు ఇతర ముఖ్య డాలరేతర కరెన్సీలు విదేశీ కరెన్సీ ఆస్తులుగా ఉంటాయి. అమెరికా ట్రెజరీ బాండ్లపై పెట్టుబడులు, ఇతర ఎంపిక చేసిన ప్రభుత్వాల బాండ్లపై పెట్టుబడులు; విదేశీ కేంద్ర బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లను కూడా విదేశీ కరెన్సీ ఆస్తులుగా పరిగణిస్తారు. 2019, ఫిబ్రవరి 1 నాటికి విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 373.40 బిలియన్ డాలర్లకు పెరిగింది.
- డిపాజిట్‌దార్లకు చెల్లించేందుకు హామీగా, కరెన్సీకి భద్రత కల్పించేందుకు ఆర్‌బీఐ బంగారం నిల్వలను నిర్వహిస్తుంది. 2019, ఫిబ్రవరి 1 నాటికి బంగారం నిల్వ విలువ 1.470 బిలియన్ డాలర్లకు చేరింది.

విదేశీ మారక ద్రవ్య నిల్వలో నాలుగు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి..
1. విదేశీ కరెన్సీ ఆస్తులు
2. బంగారం
3. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్
4. అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund)లో దేశ రిజర్వ్ స్థితి.


- అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 1969లో అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను సృష్టించింది. వీటిని అయిదు ముఖ్య జాతీయ కరెన్సీ (అమెరికా డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపాన్ యెన్, పౌండ్ స్టెర్లింగ్) ల భారత్వం ఆధారంగా ఆవిర్భవింపజేసి, కృత్రిమ కరెన్సీ సాధనంగా వినియోగించుకుంటుంది. 2019, ఫిబ్రవరి 1నాటికి ఐఎంఎఫ్‌లో భారత స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 1.470 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఊ 2019, ఫిబ్రవరి 1 నాటికి అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారత్ నిల్వ స్థితి (Reserve position) 2.654 బిలియన్ డాలర్లకు చేరింది.

అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీ (2019)
యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) విడుదల చేసిన అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీ (2019)లో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. గత ర్యాంకు 44కాగా, ప్రస్తుతం అది 36వ ర్యాంకుకు ఎగబాకింది. మొత్తం 50 దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. యూకే, స్వీడన్ వరుసగా రెండు, మూడు స్థానాలు సాధించాయి. 2018లో భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలు దేశ మేధో సంపత్తి వ్యవస్థ మెరుగుదలకు ఉపయోగపడినట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ మేధో సంపత్తిలో భాగమయ్యేందుకు భారత్ చేస్తున్న కృషిని ప్రశంసించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ఇంటర్నెట్ ఒప్పందాలు వంటివి మేధో సంపత్తి సూచీలో భారత్ ర్యాంకు పెరగడానికి ఉపయోగపడినట్లు అభిప్రాయపడింది. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయ పరిపాలనా సామర్థ్యాన్ని ఆధునికీకరించడంపై ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ర్యాంకు మెరుగుదలకు కారణమని తెలిపింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. 2018-19 (ఏప్రిల్-సెప్టెంబర్)లో భారత్ ఆకర్షించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (Foreign Direct Investment-FDI)కు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. 2017-18 (ఏప్రిల్-సెప్టెంబర్)తో పోల్చినపుడు ఎఫ్‌డీఐల్లో 11 శాతం మేర క్షీణత నమోదైంది. 2017-18 (ఏప్రిల్-సెప్టెంబర్)లో భారత్ 25.35 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించగా, ఇది 2018-19 (ఏప్రిల్-సెప్టెంబర్) మధ్యకాలంలో 22.66 బిలియన్ డాలర్లకు తగ్గింది.

- 2018-19 (ఏప్రిల్-సెప్టెంబర్)లో భారత్ ఆకర్షించిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సేవలు మొదటి స్థానం పొందగా, తర్వాతి స్థానాల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్; టెలీకమ్యూనికేషన్స్, వాణిజ్యం, రసాయనాలు, ఆటోమొబైల్ పరిశ్రమ నిలిచాయి. ఈ కాలంలో సేవలు 4.91 బిలియన్ డాలర్లు; కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 2.54 బిలియన్ డాలర్లు; టెలీకమ్యూనికేషన్స్ 2.17 బిలియన్ డాలర్లు; వాణిజ్యం 2.14 బిలియన్ డాలర్లు; రసాయనాలు 1.6 బిలియన్ డాలర్లు; ఆటోమొబైల్ పరిశ్రమ 1.59 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాయి.

- ఈ కాలంలో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐల్లో సింగపూర్ వాటా అత్యధికంగా 8.62 బిలియన్ డాలర్లుగా నమోదైంది. తర్వాతి స్థానాల్లో మారిషస్, నెదర్లాండ్స్, జపాన్, అమెరికా, బ్రిటన్ ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం తగ్గడం వల్ల భారత్‌లో చెల్లింపు శేషంలో లోటు పెరగడంతో పాటు రూపాయి విలువపైనా ప్రభావం చూపగలదు.

- గత అయిదేళ్లలో భారత్ 239 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించినట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఈ కాలంలో మారిషస్, సింగపూర్, నెదర్లాండ్స్, అమెరికా, జపాన్‌లు భారత్ ఎఫ్‌డీఐలకు ప్రధాన ఆధారంగా నిలిచాయి. సింగిల్ బ్రాండ్ రిటైల్, రక్షణ, ఎయిర్‌లైన్స్, ఆహార శుద్ధిలో విదేశీ పెట్టుబడులపై ఆంక్షలను సడలించిన నేపథ్యంలో రాబోయే కాలంలో భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదు.

టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ)ఆధారిత ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2019, జనవరిలో 2.76 శాతంగా నమోదైంది. గత పది నెలలతో పోల్చితే 2019, జనవరిలో ద్రవ్యోల్బణం తగ్గుదలకు తయారీ ఉత్పత్తి ధరల తగ్గుదలతో పాటు ఇంధనం, ఆహార ధరల్లో క్షీణత కారణమైంది. 2018, జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.02 శాతం కాగా.. 2018, డిసెంబర్‌లో 3.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సగటు ద్రవ్యోల్బణం 2.49 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సంబంధించి సగటు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2.47 శాతం. టోకు ధరల సూచీలో 64.23 శాతం భారత్వం కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2018, జనవరిలో 2.96 శాతం కాగా, ఇది 2019, జనవరి నాటికి 2.61 శాతానికి తగ్గింది. డబ్ల్యూపీఐలో ప్రాథమిక ఉత్పత్తులు 22.62 శాతం భారత్వం కలిగి ఉండగా, ఆయా ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2018, జనవరిలో 2.53 శాతం కాగా, 2019, జనవరి నాటికి 3.54 శాతానికి పెరిగింది. గత ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ లెండింగ్ రేటును 0.25 శాతం తగ్గించింది. ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదల కొనసాగితే రాబోయే కాలంలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించేందుకు అవకాశముంది.
Published date : 11 Mar 2019 01:30PM

Photo Stories