Akash Ambani రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా - తనయుడికి చైర్మన్‌గా పగ్గాలు
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియకు తెరతీశారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. తద్వారా టెలికం విభాగం పగ్గాలను తనయుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. జూన్ 27న సమావేశమైన కంపెనీ బోర్డు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ ఎం. అంబానీని చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు రిలయన్స్ జియో స్టాక్ ఎక్సేంజీలకు తాజాగా సమాచారమిచ్చింది. అదే రోజు సాయంత్రం ముకేశ్ అంబానీ రాజీనామా చేసినట్లు బోర్డు వెల్లడించింది. 217 బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్ గ్రూప్.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాలలో విస్తరించింది.
also read: UAE అధ్యక్షుడు బిన్ జాయెద్ తో ప్రధాని మోదీ భేటీ
వారసులకు బాధ్యతలు...
ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. రిటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30 ఏళ్లు) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఈషా వివాహం చేసుకున్నారు. అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ కాగా.. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌వీఎల్) బోర్డులో విధులు నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్‌లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ కలిగి ఉంది. ఇక డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) బోర్డులోనూ 2014 అక్టోబర్ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక 26 ఏళ్ల అనంత్ ఇటీవలే ఆర్‌ఆర్‌వీఎల్ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జేపీఎల్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Also read: Quiz of The Day (June 29, 2022): సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
ఆర్‌ఐఎల్ చైర్మన్‌గా ముకేశ్...
ఆర్‌ఐఎల్‌కు ముకేశ్ అంబానీ చైర్మన్, ఎండీగా, ఆయన సతీమణి నీతా అంబానీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చైర్మన్‌గానూ ముకేశ్ కొనసాగనున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌సహా అన్ని జియో డిజిటల్ సర్వీసుల బ్రాండ్లు జియో ప్లాట్‌ఫామ్స్ కిందకు వస్తాయి. కంపెనీ వివరాల ప్రకారం అంబానీ కుటుంబ వాటా ఆర్‌ఐఎల్‌లో 50.6 శాతానికి చేరింది. 1973లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి కంపెనీ టెక్స్‌టైల్స్ నుంచి చమురు, టెలికం, రిటైల్ తదితర రంగాలలో విస్తరించింది.