Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు
సగటు మనిషిపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది?
అవసరమైన వనరులను వాడుకున్నందుకు ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. పన్ను ఎంత కట్టాలి అని నిర్ణయించేది బడ్జెట్టే. కాబట్టి సామాన్యులపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. పన్నులు ఎక్కువ ఉంటే ఆర్థికభారం పెరిగినట్లు, లేదంటే తగ్గినట్లు. ఉన్న పన్నుల్లో ఏ ఒక్క పన్ను పెంచినా దాని ప్రభావం సామాన్యుడిపై కచ్చితంగా ఉంటుంది.
ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టడం అవసరమా?
అవసరమే, రాజ్యాంగంలో 112వ అధికరణ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31)లో ప్రభుత్వం చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయం లెక్కలను పార్లమెంట్ ముందు ఉంచాలి. దీన్ని ‘యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్’ అంటారు. ఇది రాజ్యాంగంలో బడ్జెట్‌కు మూలరూపం.
ఇతర దేశాల్లో కూడా ఇలాగే బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లేకుండా సాగాలంటే బడ్జెట్ అవసరం. అన్ని దేశాలకు బడ్జెట్ తప్పనిసరి. కాకపోతే వారి రాజ్యాంగాలను అనుసరించి ప్రాధాన్యం ఉంటుంది. మనలాగే యూకే, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్ దేశాలు బడ్జెట్ ఆమోదం కోసం ఒక సమయాన్ని అనుసరిస్తాయి. కానీ, అమెరికాలో విడిగా బడ్జెట్ డే అంటూ ఒకటి ఉండదు. అవసరమైనపుడు వారి కాంగ్రెస్ కార్యనిర్వాహక శాఖే ఖర్చులు, ఆదాయం లెక్కలు చూసుకుంటుంది.
పేదల బడ్జెట్‌గా పేరొందింది ఏది?
1986లో ఆర్థిక మంత్రిగా వీపీసింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘పేదల బడ్జెట్’గా పేర్కొంటారు. ఈ బడ్జెట్‌లో రైల్వేపోర్టర్లకు, రిక్షా కార్మికులకు సబ్సిడీలతో కూడిన రుణాలను ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటుచేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కోసం ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టారు.