Spectrum వేలం కోసం రూ. 21,800 కోట్ల బయానా
త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు రూ. 21,800 కోట్లు బయానాగా (ఈఎండీ) చెల్లించాయి. వీటిలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అత్యధికంగా రూ. 14,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి. టెలికం శాఖ పోర్టల్‌లో పొందుపర్చిన ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్ల జాబితా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద 2021లో మూడు సంస్థలు బరిలో ఉన్నప్పుడు వచ్చిన రూ. 13,475 కోట్లతో పోలిస్తే తాజాగా మరింత ఎక్కువగా రావడం గమనార్హం. బిడ్డింగ్‌కు సంబంధించి డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి జియోకి అత్యధికంగా 1,59,830 అర్హత పాయింట్లు, ఎయిర్‌టెల్‌కు 66,330, వొడాఫోన్‌కు 29,370, అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు 1,650 పాయింట్లు కేటాయించారు. జులై 26న ప్రారంభమయ్యే వేలంలో వివిధ ఫ్రీక్వెన్సీల్లో 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం విక్రయించనుంది. బేస్ ధర ప్రకారం దీని విలువ రూ. 4.3 లక్షల కోట్లు. కంపెనీలు డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి స్పెక్ట్రం కొనుగోలు చేయడంలో వాటి ఆర్థిక స్థోమత, వ్యూహాలు మొదలైన వాటిపై అంచనాకు రావచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.|
Also read: Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP