Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్
దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్య.. ఆర్థిక విధానాల స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీసే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలన్న అభిప్రాయంతో ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘దేశ ద్రవ్య, ఆర్థిక విధానాలను అస్థిరపర్చే అవకాశమున్నందున క్రిప్టోలపై చట్టాలను రూపొందించాలని ఆర్‌బీఐ సూచించింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నది ఆర్‌బీఐ అభిప్రాయం‘ అని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఏ కరెన్సీనైనా కేంద్రీయ బ్యాంకులు లేదా ప్రభుత్వాలే జారీ చేయాల్సి ఉంటుందని.. క్రిప్టోలు ఆ కోవకు చెందవు కాబట్టి వాటిని కరెన్సీగా పరిగణింపజాలమని ఆర్‌బీఐ పేర్కొంది. అధికారిక కరెన్సీల విలువకు ఒక చట్టబద్ధత ఉంటుందని, కానీ క్రిప్టోలన్నీ కూడా స్పెక్యులేషన్‌పైనే పనిచేస్తాయి కాబట్టి దేశ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించింది. క్రిప్టోకరెన్సీలకు సరిహద్దులేమీ లేకపోవడంతో వీటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పుడు మాత్రమే క్రిప్టోలపై నిషేధం సమర్థంగా అమలు కాగలదని పేర్కొన్నారు.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP