Inspiring Yoga Gurus: యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువులు వీరే..
యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరమహంస యోగానంద
పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు.
తిరుమలాయ్ కృష్ణమాచార్య
ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు.
ధీరేంద్ర బ్రహ్మచారి
ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది.
కృష్ణ పట్టాభి జోయిస్
ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.
బీకేఎస్ అయ్యంగార్
బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది.
మహర్షి మహేష్ యోగి
మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు.